వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అనే నినాదం ఇప్పుడు వన్ నేషన్ – నైన్ ట్యాక్స్‌లుగా మారిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల పేరుతో సాధారణ ప్రజలపై పన్నుల భారం మోపుతోందని (Mallikarjuna Kharge) ఆరోపించారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ – “2011లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. 2005లో యూపీఏ-1 ప్రభుత్వం జీఎస్టీ రూపకల్పన ప్రారంభించగా, యూపీఏ-2 కాలంలో 2011లో బిల్లు ప్రవేశపెట్టబడింది. కానీ బీజేపీ అప్పట్లో ఆ బిల్లును అడ్డుకుంది. ముఖ్యంగా గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఆ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ అదే మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక, జీఎస్టీ రేట్లను పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు” అని అన్నారు.
జీఎస్టీ అమలు చేయడం వెనుక ఉద్దేశ్యం ప్రజలపై పన్నుల భారం తగ్గించడమని కాంగ్రెస్ చెప్పిందని, కానీ బీజేపీ దానిని పూర్తిగా వక్రీకరించిందని ఖర్గే ఆరోపించారు. ప్రస్తుతం 0%, 5%, 12%, 18%, 28% స్లాబుల పేరుతో అనేక ఉత్పత్తులపై అన్యాయంగా పన్నులు విధిస్తున్నారని ఆయన విమర్శించారు.
“సామాన్యుడికి తినే ఆహారం, ఉపయోగించే అవసర వస్తువులు కూడా మినహాయింపులు లేకుండా పన్నుల బారిన పడుతున్నాయి. ఇవన్నీ మోడీ ప్రభుత్వపు వన్ నేషన్ – నైన్ ట్యాక్స్ పథకమే” అని ఖర్గే వ్యంగ్యంగా పేర్కొన్నారు.
అలాగే 2019, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ సంస్కరణల కోసం డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. “దాదాపు పదేళ్లుగా మేము సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారైనా మన డిమాండ్‌ను పట్టించుకోలేదు. బదులుగా పేదవాడి జేబులోంచి డబ్బు లాగేసి, జీఎస్టీ సంబరాలు చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి, ఆర్థిక న్యాయానికి వ్యతిరేకం” అని మండిపడ్డారు.
ఖర్గే వ్యాఖ్యలు ఆర్థిక రంగం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వన్ నేషన్ – వన్ ట్యాక్స్ నినాదాన్ని ముందుకు తెచ్చిన బీజేపీ, ఇప్పుడు అదే విధానాన్ని బలహీనపరుస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణంలో ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.
Also read:

