మేడారం (Medaram) మహాజాతర సందర్భంగా వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. అమ్మల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో పాటు, దర్శనం పూర్తిచేసుకుని తిరిగి తమ ఇండ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండటంతో జాతర మార్గాలన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో (Medaram) మేడారం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గోవిందరావుపేట మండలం పసరా పరిధిలో ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి పసరా ఆర్చ్ వరకు తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. మూడు వరుసలుగా వాహనాలు నిలవడంతో రహదారి పూర్తిగా బ్లాక్ అయ్యింది. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అత్యంత నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.

ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా భక్తులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి వాహనాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు భక్తులు కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, మరికొందరు వాహనాల నుంచి దిగిపడి విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. తాగునీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి.

అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న వాహనాలతో పాటు, మహాజాతరకు కొత్తగా వస్తున్న భక్తుల వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకించి పసరా, తాడ్వాయి, మేడారం మార్గాలు అత్యంత కీలకమైనవిగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. కొన్నిచోట్ల వాహనాలను డైవర్షన్ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యం ఇచ్చి ముందుగా పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు కలిసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.

అధికారులు భక్తులకు కీలక సూచనలు చేశారు. అనవసరంగా వాహనాలు నిలిపివేయకుండా పోలీసుల సూచనలను పాటించాలని, క్యూలు క్రమబద్ధంగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. అలాగే ఓపికతో వ్యవహరించాలని, ట్రాఫిక్ సమస్యను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మేడారం మహాజాతర కొనసాగుతున్నంతకాలం ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే ప్రయాణ ప్రణాళిక వేసుకోవాలని పోలీసులు సూచించారు. వనదేవతల దర్శనంతో పాటు భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా అధికారులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
Also read:

