Medaram: మేడారం రూట్ లో ట్రాఫిక్ జాం

Medaram

వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన (Medaram) మేడారం వైపు భక్తుల ప్రవాహం భారీగా పెరిగింది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో (Medaram) మేడారం వెళ్లే ప్రధాన రహదారులపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.గట్టమ్మ ఆలయం వద్ద నుంచే వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. వందల సంఖ్యలో కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు భక్తులు తమ వాహనాలను రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి మళ్లించి ఆలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

Image

మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రాక ఇప్పటికే మొదలైంది. జాతర ఇంకా ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం అధికారులను అప్రమత్తం చేసింది. మేడారం సమీపానికి వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. అధికారులు వాహనాలను ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తూ రాకపోకలను సజావుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తాడ్వాయి వైపు నుంచి, పస్రా వైపు నుంచి భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ప్రధాన రహదారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

Medaram Witnesses Heavy Devotee Influx

మేడారానికి నాలుగు లైన్ల రహదారి నిర్మించినప్పటికీ, అంచనాలకు మించి భక్తులు రావడంతో ట్రాఫిక్ జామ్ తప్పలేదు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలు అధికంగా రావడం వల్లే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.ఒక్క రోజు వ్యవధిలోనే సుమారు ఐదు లక్షల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. జంపన్న వాగు వద్ద, తాడ్వాయి కాల్వపల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అదనపు సిబ్బందిని మోహరించి వాహనాల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు సహకరించాలని, అనవసరంగా ప్రైవేటు వాహనాలు ఉపయోగించకుండా ప్రభుత్వ బస్సులను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ రాత్రి మేడారంలోనే బస చేసి, మరుసటి రోజు ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతరకు ఈసారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు మొదలవడంతో రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, షటిల్ బస్సుల నిర్వహణ వంటి చర్యలు తీసుకోనున్నారు.

Also read: