Medaram: భక్తజన సముద్రంగా మారిన మేడారం

Medaram

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వనదేవతల మహాజాతర (Medaram) మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి (Medaram) మేడారాన్ని జనసంద్రంగా మార్చారు. తాడ్వాయి, వెలుగు ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయానికే భక్తుల రాక భారీగా పెరిగింది. ముందుగా భక్తులు పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సంతాన ప్రాప్తి కోసం జంపన్న వాగు వద్ద నాగులమ్మకు ముడుపులు కట్టడం, కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించడం వంటి సంప్రదాయ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అనంతరం భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు చేరుకుని అమ్మవార్లకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె సారే, బెల్లం, బంగారం, కొబ్బరికాయలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కొందరు భక్తులు ఎత్తు బంగారంతో అమ్మవార్లను తులాభారం తూకం వేయడం విశేషంగా కనిపించింది. మేడారం పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో అటవీ ప్రాంతం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

భక్తుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గద్దెలు, జంపన్న వాగు, క్యూ లైన్లు, సంత ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంట పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య శాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

భక్తుల సౌకర్యార్థం పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్యూలైన్ల నిర్మాణం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇర్ఫా సుకన్యా సునీల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల ఓపిక, క్రమశిక్షణతో దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర మరోసారి భక్తి శ్రద్ధలతో, అపూర్వ జనసమూహంతో అద్భుతంగా కొనసాగుతోంది.

Also read: