తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర మంత్రి (Jupally) జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ రెండేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే ‘తోలు తీస్తాన’ని కేసీఆర్ హెచ్చరిస్తున్నారని ఎద్దేవా చేస్తూ, ఆ పార్టీకి ఇప్పుడు కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బలహీనపడిందని, పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కేసీఆర్కు వచ్చిందని (Jupally) ఆయన అన్నారు.పాలమూరు ప్రాజెక్టు అంశాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రజల్లోకి రావడం వెనుక అసలు ఉద్దేశం పార్టీ పరువు నిలబెట్టుకోవడమేనని జూపల్లి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. క్లియరెన్సులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను ఎలా నిర్మించారని నిలదీశారు. తాగునీటి అవసరాల పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పుడు చేసిన వాదనలకు ఇప్పటి మాటలకు ఏమాత్రం పొంతన లేదన్నారు.
డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) 2023 ఏప్రిల్లోనే వెనక్కి వచ్చిందని, అప్పట్లో కేసీఆర్ ఏం చేశారని జూపల్లి ప్రశ్నించారు. ఆ సమయంలో నిద్రపోయారా? అంటూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కల్వకుర్తి ప్రాజెక్టు ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తూ, గత పాలనలో ప్రాజెక్టుల విషయంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పక్కనపడ్డాయో కూడా జూపల్లి వివరించారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం, అలాగే బీజేపీతో అంటకాగడం వల్ల తెలంగాణకు ఏమి లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేంద్రంతో సఖ్యత అంటూ రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని, చివరకు తెలంగాణకు రావాల్సిన వాటా కూడా రాకుండా చేసారని విమర్శించారు.
ఇక పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన మంత్రి జూపల్లి, బీఆర్ఎస్ మరియు బీజేపీ కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ మూడింట ఒక వంతు సీట్లు కూడా సాధించలేకపోయాయని పేర్కొన్నారు. ఇది బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు.కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పనిచేయడం లేదని, ప్రజలు గత పాలనలో జరిగిన తప్పులను గుర్తు పెట్టుకున్నారని జూపల్లి అన్నారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు, అప్పుల భారం, అసంపూర్తి పనులు అన్నీ ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాటల దాడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.మొత్తానికి జూపల్లి కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం–ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ పోరు రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read:

