ModiGovernment: బ్రిటిష్ వారసత్వానికి గుడ్‌బై

ModiGovernment

బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పడిన వలసవాద ఆనవాళ్లను ఒక్కొక్కటిగా తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే నగరాల పేర్ల మార్పు, చారిత్రక గుర్తుల పునఃవ్యాఖ్యానం వంటి నిర్ణయాలతో ముందుకెళ్లిన (ModiGovernment) మోదీ సర్కార్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. రైల్వే శాఖ, న్యాయవ్యవస్థ, విద్యాసంస్థల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న నల్ల కోటు సంప్రదాయానికి గుడ్‌బై చెప్పే ప్రయత్నాలు మొదలయ్యాయి.మన దేశంలో రైల్వే అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్ల కోటు ధరించడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అలాగే యూనివర్సిటీల్లో స్నాతకోత్సవాల సమయంలో విద్యార్థులు నల్ల గౌన్, క్యాప్ ధరించడం కూడా సాధారణ దృశ్యమే. అయితే ఇవన్నీ బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన వలసవాద గుర్తులేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా అదే విధానాన్ని కొనసాగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ModiGovernment) పిలుపు మేరకు వలసవాద మనస్తత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఆత్మగౌరవాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధానాలే భవిష్యత్ భారతదేశానికి అవసరమని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ శాఖల్లోని యూనిఫామ్‌లను భారతీయతకు దగ్గరగా మార్చాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయంలో భాగంగా రైల్వే శాఖలో ఉపయోగిస్తున్న బ్లాక్ ప్రిన్స్ కోట్లు, బంద్‌గలా కోట్లు రద్దు చేయబడ్డాయి. వీటి స్థానంలో భారత వాతావరణానికి అనుకూలంగా ఉండే, సంప్రదాయ విలువలను ప్రతిబింబించే దుస్తులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై రైల్వే శాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది.ఇక న్యాయవ్యవస్థలోనూ కీలక మార్పులు రానున్నాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు ధరించే నల్ల కోటు, తెల్ల బాండ్ వంటి దుస్తులపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వలస పాలన సమయంలో అమల్లోకి వచ్చిన ఈ డ్రెస్ కోడ్ ఇప్పటి భారతదేశానికి అవసరమా అనే అంశంపై చర్చ జరుగుతోంది. భారతీయ సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు న్యాయవేత్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విద్యాసంస్థల్లో కాన్వొకేషన్ వేడుకల సమయంలో విద్యార్థులు ధరించే నల్ల గౌన్ల విషయంలో కూడా మార్పులు రావచ్చని సమాచారం. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులతోనే స్నాతకోత్సవాలు నిర్వహించాలన్న ఆలోచనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు సంప్రదాయ వస్త్రధారణ వైపు అడుగులు వేస్తున్నాయి.

ఈ మార్పులపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వలసవాద ఆలోచనలకు ముగింపు పలకడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. భారతీయత, స్వదేశీ భావనను ప్రోత్సహించడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. కొందరు దీనిని స్వాగతిస్తుండగా.. మరికొందరు సంప్రదాయాల పేరుతో మార్పులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ వలసవాద ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలన్న దిశగా కేంద్రం తీసుకుంటున్న ఈ అడుగు చారిత్రకంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: