భారతదేశ వాణిజ్య రాజధాని (Mumbai) ముంబైలో మహానగర పాలక సంస్థ ఎన్నికల వేడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అభ్యర్థులపై కొత్త నిబంధనలను ఎన్నికల కమిషన్ అమలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటి వరకు నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, బయోడేటా, ఆస్తులు, అప్పులు, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ వంటి అంశాలు పేర్కొనడం సరిపోతుంది. కానీ ఈసారి ఆ విధానం మారింది. ఇకపై అభ్యర్థులు ప్రజలకు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలు, పరిష్కార మార్గాలతో కూడిన ఎజెండాను సమర్పించాల్సిందేనని (Mumbai) ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రతి అభ్యర్థి తన నామినేషన్ పత్రంతో పాటు ఒక వ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆ వ్యాసంలో తాను ఎన్నికైతే చేపట్టే అభివృద్ధి పనులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రణాళికలు వివరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాసం కనీసం 500 పదాలకు తగ్గకుండా ఉండాలని కూడా స్పష్టంగా పేర్కొంది. వ్యాసం సమర్పించని అభ్యర్థుల నామినేషన్లను నేరుగా రద్దు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.ఈ నిబంధన అమలుతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు కేవలం పార్టీ పేరు, గుర్తు ఆధారంగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఇప్పుడు ప్రజా సమస్యలపై అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, మురుగు నీటి పారుదల, తాగునీటి కొరత, రోడ్ల స్థితి, పర్యావరణ సమస్యలు, స్లమ్‌ల అభివృద్ధి వంటి అంశాలు అభ్యర్థుల వ్యాసాల్లో ప్రధానంగా చోటు చేసుకుంటున్నాయి.
ఈ కొత్త రూల్‌తో అభ్యర్థులు గణనీయంగా కష్టపడాల్సి వస్తోంది. ముందుగా తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నోట్ చేసుకుంటున్నారు. వాటికి సాధ్యమైన పరిష్కారాలను రూపొందించి వ్యాసాల రూపంలో తయారు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నిపుణుల సహాయంతో వ్యాసాలు సిద్ధం చేయించుకుంటున్నట్లు సమాచారం.ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అభ్యర్థులపై బాధ్యత పెరుగుతుందని, ప్రజలు కూడా ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారో ముందే తెలుసుకునే అవకాశం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకు ఇకపై రాతపూర్వక ఆధారం ఉంటుందని అంటున్నారు.అయితే మరికొందరు అభ్యర్థులు ఈ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 500 పదాల వ్యాసం రాయడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదని, చిన్న స్థాయి అభ్యర్థులకు ఇది భారంగా మారుతుందని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Also read:

