విజయదశమి వైభవానికి నాంది పలికే శరన్నవరాత్రులు (Navatri day1) భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందం పంచే పర్వదినాలు. తొమ్మిది రోజులు అమ్మవారి విభిన్న అవతారాలను ఆరాధిస్తూ, భక్తులు తమ మనసు, మాట, కర్మలను పవిత్రం చేసుకుంటారు. వీటిలో తొలి రోజు అత్యంత శుభప్రదమైనది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జగన్మాత బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులను తన కరుణారస వీక్షణాలతో అనుగ్రహించనున్నారు లేత గులాబీ రంగు చీరతో అమ్మవారిని ముస్తాబు చేసి క్షీర అన్నము నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారు కుమారి గా దర్శనం ఇవ్వనున్నందున ఈరోజు కుమారి పూజను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ఈ రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరి అవతారం భక్తులకు దర్శనమిస్తుంది. చిన్నారిలా అమాయకత్వం, దివ్య కాంతులతో ప్రకాశించే ఈ అవతారం భక్తుల హృదయాలను నిర్మలతతో నింపుతుంది. బాలాత్రిపురసుందరి కరుణాకటాక్షంతో భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
పూజా విధానం
నవరాత్రి తొలి రోజున ఇంటిని శుభ్రపరచి, పూజా మంటపాన్ని అలంకరించి, ఘటస్థాపన లేదా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో అమ్మవారిని ఆహ్వానిస్తారు. కొబ్బరికాయతో కలశాన్ని అలంకరించి, దానిని శక్తి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ సందర్భంగా ఎరుపు వర్ణ పుష్పాలు సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
పాటించవలసిన నియమాలు
నవరాత్రి కాలమంతా భక్తులు ఆహారంలో, ఆచరణలో నియమాలను పాటిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారాన్ని మానేసి, పవిత్రతతో పూజలో నిమగ్నమవుతారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి అమ్మవారికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పూజలో శ్రద్ధ, విశ్వాసం, భక్తి ప్రధానమని వివరిస్తారు.
భక్తి తన్మయత్వం
నవరాత్రి తొలిరోజు పూజ అనేది కేవలం ఆచారం కాదు. అది అమ్మవారికి సమర్పించే మనసారా చేసే ప్రార్థన. బాలాత్రిపురసుందరి రూపాన్ని ఆరాధించడం వలన భక్తులు శిశువుల వంటి నిర్మల హృదయంతో జీవనయాత్రను కొనసాగించే శక్తి పొందుతారు.
అమ్మవారి కరుణకటాక్షం అందరికీ లభించాలని, ఈ నవరాత్రులు ప్రతి గృహానికీ శుభసంపదలు, ఐశ్వర్యం, సంతోషం తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు.
నైవేద్యం: క్షీరాన్నం
చీర రంగు: లేత గులాబీ
ప్రత్యేకత: కుమారీ పూజ
శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం
బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి
తన్నోబాల ప్రచోదయాత్
Also read: