కొంగొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో (New Year) నూతన సంవత్సరానికి రాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త ఏడాదిలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించగా, పుణ్యక్షేత్రాలు భక్తిశ్రద్ధలతో మార్మోగాయి.

వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. (New Year) కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులకు శుభాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అదే విధంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది.
మేడారం జాతర క్షేత్రం, వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం (భీమేశ్వర ఆలయం), కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా వేములవాడలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
హైదరాబాద్ నగరంలోనూ భక్తి వాతావరణం వెల్లివిరిసింది. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం, చిలుకూరి బాలాజీ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో విశేష పూజలు నిర్వహించగా, భక్తులు తమ కుటుంబాలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. నగర జీవితంలోని ఒత్తిడిని పక్కనపెట్టి, కొత్త ఏడాది తొలి రోజున దేవాలయాల బాట పట్టిన భక్తుల సంఖ్య గణనీయంగా కనిపించింది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు క్యూలైన్లతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఓర్పుతో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేసి, భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

మరోవైపు అయ్యప్ప స్వాముల తాకిడి కూడా గణనీయంగా పెరిగింది. దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు మాల విరమణ సందర్భంగా పలు ఆలయాలను సందర్శించేందుకు టూర్ల రూపంలో బయలుదేరడంతో ఆలయాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ప్రత్యేకంగా హైదరాబాద్ వంటి నగరాల్లో న్యూ ఇయర్ ఈవ్ వేడుకల్లో పాల్గొన్న యువతీ యువకులు కూడా కొత్త ఏడాది ఉదయం భక్తిశ్రద్ధలతో దేవాలయాల బాట పట్టారు. రాత్రి సంబరాల తర్వాత ఉదయం పూజలతో కొత్త సంవత్సరాన్ని ఆరంభించడం విశేషంగా కనిపించింది.


Also read:

