కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్(Sindoor) పూర్తి చేశామని, పీవోకేలోని హిజ్బుల్, లష్కరే తోయిబా స్థావరాలను ధ్వంసం చేశామని, 100 మంది టెర్రరిస్టులను హతమార్చామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇవాళ ఆపరేషన్ సిందూర్ పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. పహెల్గాం ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని ఉగ్రవాదంపై పోరుకోసం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించామని అన్నారు. ‘‘మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయి. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారు. మన సైనికులు ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారు. సిందూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగింది. దాయాది దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. మన సైనికులు మిసైళ్లతో పాకిస్థాన్ డ్రోన్లపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌లోని మిసైల్ లాంఛింగ్ స్టేషన్ ధ్వంసమైంది. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారు. ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చాం. మనం చేసిన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్ చేశారు.’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆపాలని తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని చెప్పారు. పాక్ సీజ్ ఫైర్ కు ఒప్పుకుందని తెలిపారు. పాకిస్తాన్ దాడిలో భారత్ కు ఎలాంటి నష్టమూ జరగలేదన్నారు. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని, ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నానని అన్నారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని తెలిపారు. ఆపరేషన్ సిందూరు సమంలో సామాన్యులకు ఇబ్బంది లేకుండా లక్షిత దాడులు చేసినట్టు చెప్పుకొచ్చారు. పహెల్గాం ఉగ్రవాదులను అంతమొందించినట్టు వివరించారు. 1962 యుద్ద సమయంలో విపక్షాలు హుందాగా వ్యవహరించాయని గుర్తు చేశారు. తాను నలభై ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి విమర్శలు ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. జమ్మ కశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు.(Sindoor)
భారత్ శాంతిని కోరుతుంది
1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్ యాత్ర చేపట్టారని రాజ్ నాథ్ చెప్పారు. పాకిస్తాన్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్‌పేయీ చెప్పారని గుర్తు చేశారు. స్నేహ హస్తం చాచడమే భారత్ గొప్పతనమని, ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదన్నారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉందని, మనం యుద్ధాలు కోరుకోబోమని కుండ బద్దలు కట్టారు. ప్రతి విషయాన్నీ మానవత్వ కోణంలో ఆలోచిస్తామని, తుపాకులు పేలితే ఎవరూ మిగలరని చెప్పుకొచ్చారు.
Also Read :

