Parliament: తెలంగాణ ఎంపీల ప్రమాణం

రాష్ట్రానికి చెందిన 15 మంది ఎంపీలు ఇవాళ లోక్ సభలో  ప్రమాణం స్వీకరించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇదివరకే ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి కార్మికుల డ్రెస్ కోడ్ లో (నేవీ బ్లూ డ్రెస్) పార్లమెంటుకు (Parliament) హాజరయ్యారు. పార్లమెంటు (Parliament) సభ్యుడిగా ప్రమాణం స్వీకరించారు. తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ హిందీలో ప్రమాణం స్వీకరించారు. వంశీకృష్ణ(పెద్దపల్లి) ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి( చేవెళ్ల), రఘునందన్ రావు( మెదక్), రామసహాయం రఘురాంరెడ్డి(ఖమ్మం) ఇంగ్లీషులో ప్రమాణం స్వీకరించారు. సురేశ్ షెట్కార్( జహీరాబాద్) ఈటల రాజేందర్( మల్కాజ్ గిరి), డీకే అరుణ(మహబూబ్ నగర్), మల్లు రవి(నాగర్ కర్నూల్),కుందూరు రఘువీర్ రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్​కుమార్ రెడ్డి (భువనగిరి), కడియం కావ్య(వరంగల్), పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్) తెలుగులో ప్రమాణం చేశారు.

పార్లమెంటులో ‘జై తెలంగాణ’
ఎంపీలుగా ప్రమాణం స్వీకరించిన పలువురు చివరన జై తెలంగాణ అని నినదించారు. సురేశ్ షెట్కార్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, అసదుద్దీన్ ఒవైసీ, మల్లు రవి, చామల కిరణ్​ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, రామ సహాయం రఘురాంరెడ్డి తమ ప్రమాణం పూర్తయ్యాక చివరన జై తెలంగాణ అంటూ నినదించారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని, అసదుద్దీన్ జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. మల్లు రవి జై భీమ్ తోపాటు జై కాన్స్టిట్యూషన్ అని, చామల కిరణ్ కుమార్ రెడ్డి జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అని, కడియం కావ్య జై భద్రకాళి, సేవ్ కాన్సిస్టిట్యూషన్ అని, పోరిక బలరాం నాయక్ జై తుల్జా భవానీ అని, రామ సహాయం రఘురాంరెడ్డి జై సంవిధాన్ అని నినదించారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, కడియం కావ్య రాజ్యాంగం పుస్తకాలను చేతిలో పట్టుకొని ప్రమాణం చేయడం విశేషం.

అసద్ నోట.. జై పాలస్తీనా! 
హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం తర్వాత జై భీం.. జై మీం.. జై తెలంగాణ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యానించారు. సభలో జై పాలస్తీనా అంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సభలో ప్రొటెం స్పీకర్ ను ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ భారత పార్లమెంట్ ను అగౌర పరుస్తున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై ప్రొటెం స్పీకర్ స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగిస్తామని సభకు హామీ ఇచ్చారు. దీంతో సభలో గొడవ సద్దుమణిగింది.

Also read: