పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) అభ్యర్థులెవరో తేలిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్లను ఆయా పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బీజేపీ తమ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని డిసైడ్ చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ (Graduate MLC) పదవికి రాజీనామా చేశారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం రేపటితో ముగియనుంది. నల్లగొండ కలెక్టరేట్ లో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. ఈ నెల 13 వరకు ఉపసంహరణలకు గడువు ఉంది. ఈ నెల 27 పోలింగ్ జరగనుంది. జూన్ ఐదో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. షెడ్యూల్ వెలువడకముందే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. తమ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలోకి దిగుతారని బీఆర్ఎస్ తెలిపింది. బీజేపీ టికెట్ కోసం ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి పోటీ పడ్డారు. ఈ ముగ్గురి పేర్లను బీజేపీ రాష్ట్ర శాఖ జాతీయ నాయకత్వానికి పంపింది. వారిలో ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధినాయకత్వం ఖరారుచేసింది. మూడు ప్రధాన పార్టీతో పాటు ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలువనున్నారు. ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనేది రేపు సాయంత్రానికి తేలనుంది.
Also read:

