కొండగట్టు క్షేత్రం తనకు పునర్జన్మనిచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భావోద్వేగంతో అన్నారు.విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆంజనేయ స్వామి కాపాడాడని తెలిపారు. ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని పేర్కొన్నారు.
ఆ రోజు నుంచి కొండగట్టు ఆంజనేయస్వామిపై తనకు అపారమైన భక్తి ఏర్పడిందన్నారు.ఇవాళ కొండగట్టు ఆలయ ప్రాంగణంలో (Pawan Kalyan) పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం 96 గదుల ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీక్ష విరమణ మండప నిర్మాణానికి కూడా భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముందు వేద పండితులు పవన్ కల్యాణ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పవన్ కల్యాణ్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. కొండగట్టు ఆలయంలో భక్తులకు సరైన వసతులు లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ అంశాన్ని టీటీడీ బోర్డు సభ్యులు చర్చకు తీసుకొచ్చారని తెలిపారు. మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి ఈ ప్రతిపాదనకు ముందుకొచ్చారని అన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ నిర్ణయానికి మద్దతిచ్చారని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సహకరించారని పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దైవ కార్యక్రమమని తెలుసుకున్న వెంటనే సీఎం ఆమోదం తెలిపారని చెప్పారు. ఆయన మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి అభివృద్ధి పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఈ క్షేత్రం తన జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు.
ఇక్కడికి వచ్చిన ప్రతీసారి మనసుకు శాంతి లభిస్తుందన్నారు. అంజన్న ఆశీస్సులు ఉంటే ఏ కష్టం అయినా తేలిక అవుతుందన్నారు.
అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు అంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.రాష్ట్రాల మధ్య సమన్వయంతో దేవాలయ అభివృద్ధి జరగడం ఆనందంగా ఉందన్నారు.
Also read:

