హిందూ ధర్మంలో అమావాస్య రోజులు పితృదేవతలకు అతి ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. ప్రత్యేకంగా పెత్తరమాస (Peddaramasa) లేదా మహాలయ అమావాస్యను శ్రాద్ధం, తర్పణం చేయడానికి అత్యంత శ్రేష్ఠమైన దినంగా పూజనీయంగా భావిస్తారు. ఈ రోజున పితృదేవతలు (Peddaramasa) వాయు రూపంలో గృహద్వారాలకు విచ్చేసి తమ వంశస్థులచే ఆచరించబడే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, అన్నదానాలు స్వీకరించి సంతృప్తి చెందుతారని గరుడ పురాణం పేర్కొంది.
హిందూ కుటుంబాల్లో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధతో పితృదేవతలకు పూజలు చేస్తారు. సాధ్యమైనంతవరకు శాస్త్రోక్తంగా శ్రాద్ధం చేయడం, తిల తర్పణం, పితృదేవతల ప్రీతికి అన్నం, జలం, పాలు, కందమూలాలు, ఫలాలు సమర్పించడం మేలనిది. వీటిని సమర్పించలేని వారు కనీసం నదులు, సముద్రాలు, చెరువులు లేదా బావుల్లో స్నానం చేసి జల తర్పణం చేయవచ్చు. దానికీ అవకాశం లేకుంటే ఇంట్లోనే స్నానం చేసి పితృస్తుతి చేసి నీరు సమర్పించినా ఫలప్రదమే అవుతుంది.
ఈ రోజున శ్రాద్ధ విధులు చేయలేనివారు దానధర్మాలు చేయడం ద్వారానూ పితృదేవతలను సంతృప్తిపరచవచ్చు. వస్త్రదానం, అన్నదానం, గోవు దానం వంటి దానాలు పితృప్రసన్నతికి దోహదం చేస్తాయని శాస్త్రాలు పేర్కొన్నాయి.
పితృదేవతల పూజలో శ్లోక పఠనం కూడా అత్యంత ప్రాధాన్యం కలిగివుంది. పితృదేవతలు అమావాస్య నాడు గృహద్వారాలకు చేరుకొని శ్రాద్ధం కోసం వేచి ఉంటారని తెలియజేసే శ్లోకం ఇది:
శ్లోకం – 1
అమావాస్యే దినే ప్రాప్తే
గృహద్వారే యే సమాశ్రితాః |
వాయుభూతాః ప్రవాంఛంతి
శ్రాద్ధాం పితృగణానృణామ్ ॥
అదే విధంగా ప్రతిరోజూ శ్రాద్ధం లేదా కనీసం పితృస్మరణ కోసం అన్నం, నీరు, పాలు, ఫలాలను సమర్పించడం పితృదేవతల ప్రీతికి కారణమవుతుందని మరో శ్లోకం చెబుతోంది:
శ్లోకం – 2
కుర్యాదహరహశ్రాద్ధం
అన్నద్యేనోదకేనవా |
పయోమూలఫలైర్వాపి
పితృభ్యః ప్రీతిమావహన్ ॥
ఈ శ్లోకాల పఠనం పితృస్మరణకు, పితృదేవతల సంతోషానికి మార్గం చూపుతుంది. పెత్తరమాస పితృ అమావాస్య నాడు వీటిని పఠించి శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు చేస్తే వంశానికి శాంతి, సుఖసంపదలు లభిస్తాయని విశ్వాసం.
మొత్తానికి, ఈ రోజు చేసిన శ్రాద్ధం, తర్పణం, దానం వంశంలోని ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక లాభాలను, పుణ్యఫలాలను కలిగిస్తుందని పురాణ వచనం చెబుతోంది. అందుకే ప్రతి కుటుంబం తమకు సాధ్యమైన రీతిలో పితృపూజలు చేయడం శ్రేయస్కరం.
Also read:
- Telangana: జాతిపితగా జయశంకర్ సార్‌ను గుర్తించాలని డిమాండ్
- Aryan Mann: డీయూఎస్‌యూ అధ్యక్షుడిగా ఆర్యన్ మాన్