భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు తన 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. స్వచ్ఛమైన కృషి, అసాధారణ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై అంకితభావం ఆయనను కేవలం భారత దేశానికే కాదు, ప్రపంచ వేదికలపై ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఈ సందర్భంగా దేశంలోని అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, విదేశీ నాయకులు కూడా (PM Modi) ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ, “మీ దార్శనిక నాయకత్వంలో దేశం ఎన్నో గొప్ప లక్ష్యాలను సాధించింది. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసం ఉంచింది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. మీ నాయకత్వంలో భారత్ కొత్త శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా మోదీకి అభినందనలు తెలుపుతూ, “ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికలపై తన ముద్ర వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది” అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోదీ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా స్పందిస్తూ, “త్యాగం, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన మోదీ, కోట్లాది మంది ప్రజల ప్రేమను పొందారు. ఆయన జీవితమంతా నేషన్ ఫస్ట్ అనే సూత్రానికే అంకితం అయింది. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న మోదీ ప్రతి పౌరుడికి స్ఫూర్తి” అని తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, “ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, నవ భారత నిర్మాణ శిల్పి ప్రధాన మంత్రి మోదీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అనే నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మీ నాయకత్వంలో దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభిస్తోంది” అని పేర్కొన్నారు.
ప్రజల స్పందన
దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. #HappyBirthdayModi, #ModiAt75 వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన దేశసేవలో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
మోదీ నాయకత్వం – దేశ దిశ
గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాల ద్వారా దేశ అభివృద్ధి దిశగా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ తరపున మోదీ ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టిన రోజు సందర్భంగా దేశం మొత్తం ఆయన నాయకత్వాన్ని స్మరించుకుంటోంది. ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం, దూరదృష్టి, సేవాభావం ఆయనను ఒక విశిష్ట నాయకుడిగా నిలబెట్టాయి. భవిష్యత్తులో కూడా దేశ అభివృద్ధి కోసం మోదీ తన కృషిని కొనసాగించాలని కోట్లాది ప్రజలు ఆశిస్తున్నాయి.
Also read: