ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ‘వికసిత్ భారత్’ లక్ష్యానికే అంకితమై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 అడుగుల అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని (PM Modi) ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ… వాజ్‌పేయి ఆలోచనలు, ఆయన చూపిన మార్గం ఈ దేశానికి ఇప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ భారత్‌లోనే ఉందని ప్రధాని తెలిపారు. గత పన్నెండేళ్లలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, కోట్లాది మంది పేదలు పేదరిక రేఖ నుంచి బయటకు వచ్చారని అన్నారు. ఇది కేవలం ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం, శ్రమ, కృషి వల్లే సాధ్యమైందని వివరించారు. ఈ అభివృద్ధి ప్రయాణానికి పునాది వేసింది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారేనని మోదీ కొనియాడారు.
లక్నోలో ఆవిష్కరించిన ఈ ‘ప్రేరణ స్థల్’ దేశ ప్రజలకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుందని ప్రధాని అన్నారు. ప్రతి భారతీయుడు వేసే ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలన్న భావనను ఈ స్థలం గుర్తుచేస్తుందన్నారు. దేశానికి సేవ చేసిన మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. చరిత్రలోని గొప్ప నాయకుల ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తినివ్వాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో దేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని, మౌలిక వసతులు, సాంకేతికత, విదేశాంగ విధానంలో భారత్‌కు కొత్త గుర్తింపు వచ్చిందని మోదీ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేటి ప్రభుత్వం కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందన్నారు.
ఇదే రోజు ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమంలో కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, అక్రమాలు ఉండేవని, ఆ పరిస్థితికి తమ ప్రభుత్వం పూర్తిగా ముగింపు పలికిందని చెప్పారు. గత దశాబ్దంలో క్రీడా రంగంలో పూర్తిగా పారదర్శకత వచ్చిందని, ప్రతిభే ప్రధాన ప్రమాణంగా మారిందని తెలిపారు.ప్రస్తుతం పేద కుటుంబాల పిల్లలు కూడా తమ ప్రతిభ, కష్టపడే తత్వంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ప్రధాని అన్నారు. ఇది ప్రభుత్వ విధానాల ఫలితమేనని చెప్పారు. 2014కు ముందు క్రీడల కోసం కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే కేటాయించేవారని, ఇప్పుడు అది రూ.3,000 కోట్లకు పైగా పెరిగిందని వివరించారు.అలాగే ప్రత్యేక పథకాల ద్వారా అర్హులైన అథ్లెట్లకు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ మద్దతుతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారని చెప్పారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌ల్లో భారత్ సాధిస్తున్న విజయాలు దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
Also read:

