Rahul Gandhi: ఓటు చోరీ.. సాఫ్ట్‌వేర్ గేమ్

Rahul Gandhi

ఓటు అనే ప్రజాస్వామ్య పవిత్ర హక్కు సాంకేతిక మాయాజాలంతో దోపిడీకి గురవుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పేదలు, రోజువారీ కూలీల ఓట్లు లక్ష్యంగా మారాయని, అర్ధరాత్రి, తెల్లవారు జామున నకిలీ లాగిన్‌లు, ఫేక్ నంబర్ల ద్వారా ఓటర్ల పేర్లు బల్క్‌గా తొలగిస్తున్నారని బాంబు పేల్చారు. “ఇది తప్పిదం కాదు, కేంద్రీకృత ఆపరేషన్. ఇది ప్రజాస్వామ్యంపై యుద్ధం” అంటూ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు.

Image

హైడ్రోజన్ బాంబ్ ప్రెస్ మీట్

ఈ అంశంపై రాహుల్ గాంధీ ఇవాళ “హైడ్రోజన్ బాంబ్” పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వేల ఓట్లు తొలగించబడ్డాయని, ఫేక్ లాగిన్‌లు, డిజిటల్ ఫారమ్‌లను వాడి ఓట్లు సాఫ్ట్‌వేర్ గేమ్ ద్వారా మాయం చేశారని చెప్పారు. ముఖ్యంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఈ ఆపరేషన్ వెనుక ఉన్న శక్తులను కాపాడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Image

ఒక్క రాత్రే 6,018 ఓట్లు మాయం

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అలంద్ నియోజకవర్గంలో ఒక్క రాత్రిలోనే 6,018 ఓట్లు మాయం అయ్యాయని రాహుల్ తెలిపారు. ఒక బూత్ లెవల్ అధికారి తన మామగారి పేరు జాబితా నుంచి తొలగించబడ్డట్లు గుర్తించడంతో అసలు బండారం బయటపడిందని వివరించారు. “వోటర్‌కే తెలియదు, తొలగించినవాడికీ తెలియదు. ఇది అంతా సాఫ్ట్‌వేర్ గేమ్” అని వ్యాఖ్యానించారు.

Image

పేదలకే ప్రధాన టార్గెట్

రోజువారీ కూలీలు, బీద కుటుంబాలే ప్రధానంగా టార్గెట్ అయ్యారని రాహుల్ తెలిపారు. “వాళ్లు ఉదయం పనికి వెళ్తారు. కానీ రాత్రికి వారి ఓటు మాయం అవుతుంది. అసలు వారికి తెలియదు కూడా. ఇది పేదల ఓట్లపై దాడి” అని విమర్శించారు.

సీఐడీ లేఖలకు స్పందన లేని ఎన్నికల సంఘం

ఈ స్కాంపై కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు రాసినా, ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి డేటా రాలేదని రాహుల్ ఆరోపించారు. “ఐపీ అడ్రెసులు, ఓటీపీ ట్రైల్స్ ఇస్తే అసలు ఆపరేషన్ ఎక్కడి నుంచి నడుస్తుందో బయటపడుతుంది. కానీ దానిని దాచేస్తున్నారు” అని అన్నారు.

Image

బాధితులను ప్రెస్ మీట్‌కు తీసుకువచ్చిన రాహుల్

ప్రెస్ మీట్‌లో రాహుల్ బాధితులను ముందుకు తెచ్చారు. “వారి ఫోన్ నంబర్లు వాడి ఓట్లు తొలగించారు. కానీ వారికి అసలు తెలియదు” అని చెప్పారు. ఈ విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు చూపించారు. రాజ్యాంగాన్ని పైకెత్తి యువతను ఉద్దేశిస్తూ – “ఇదే మీ భవిష్యత్తు, ఇదే మీ ఉద్యోగాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఇవన్నీ పోతాయి” అంటూ హెచ్చరించారు.

Also read: