ప్రభుత్వం కొలువుల భర్తీకి టాప్ ప్రయారిటీ ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) చెప్పారు. ఇవాళ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ ప్రజాభవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం(CM Revanth) మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని చెప్పారు. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఎందరో అమరుల త్యాగాల పునాదులమీదనే స్వరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే గ్రూప్–2 వాయిదా వేశామని చెప్పారు. గత ప్రభుత్వం కొలువులు ఇవ్వకుండా పదేండ్లు మభ్యపెట్టిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే 90 రోజుల వ్యవధిలో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశామని, యూపీఎస్సీ తరహాలోనే మార్పులు చేశామని అన్నారు. ఇక పై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఇకపై ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు. జూన్ 2వ తేదీలోగా నోటిపికేషన్లు విడుదల చేసి డిసెంబర్ 9వ తేదీలో కొలువుల భర్తీ ప్రక్రియను చేపడుతామని వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా.. నిర్ణీత సమయంలో పరీక్ష నిర్వహించేలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనా దృష్టి పెట్టాలని అన్నారు బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారని, సెంట్రల్ సర్వీసుల మీద వారు చూపుతున్న శ్రద్ధే ఇందుకు కారణమని చెప్పారు. మన రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాలని సీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. .
Also read :
Prabhakar rao : ప్రభాకర్ రావును ప్రవేశపెట్టండి

