ఎమ్మెల్సీ కవిత (Kavitha)బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు జడ్జి కావేరి భవేజ తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వింటామని తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన వాదనల్లో కవిత తరఫున సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవిత కుమారుడికి పరీక్షలున్నాయని, ఆయన భయంలో ఉన్నారని, ఈ సమయంలో తల్లి సపోర్ట్ అవసరమని, అందుకే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కవిత తరఫున సింఘ్వీ రిజాయిండర్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45, మహిళ గా, కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కోర్టు ముందుంచారు. ఆమె కుమారుడు మానసికంగా కుంగిపోయాడని తెలిపారు.
ఆ ప్రభావం పరీక్షలపై పడే అవకాశం ఉందన్నారు. మహిళలకు బెయిల్ ఇచ్చిన కేసుల వివరాలను కోర్టులో సింఘ్వీ ప్రస్తావించారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళలకు బెయిల్ ఇవ్వకూడదన్నారు. ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని చెప్పారు. లిక్కర్ స్కాం కోసం ప్లాన్ చేసింది కవిత (Kavitha)అని అన్నారు. ఆమె ఈడీకి 10 ఫోన్లు సమర్పించారని, అవన్నీ ఫార్మాట్ చేసినవేనని అన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని చెప్పారు. డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారని తెలిపారు. నిందితులు వందల డివైజ్ లను ధ్వంసం చేశారని కోర్టుకు విన్నవించారు. అప్రూవర్ గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. అరుణ్ పిళ్లై కవితకు లిక్కర్ స్కాంలో ప్రాక్సీగా ఉన్నారని చెప్పారు. ఇండో స్పిరిట్ లో 33శాతం వాటా పిళ్లై, కవితకు ఉందని అన్నారు. దినేశ్ అరోరా అప్రూవర్ గా మారిన తర్వాత అన్ని విషయాలు చెప్పారని వివరించారు. కవిత ఆలోచన మేరకే రూ. 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ముట్టాయని అన్నారు.
కవిత (Kavitha)చిన్న కొడుకు ఒంటరిగా ఏమీ లేడని, 22 ఏండ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవితను ఇప్పటికే ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారని అన్నారు. పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారని, కానీ ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని చెప్పారు. కవిత కొడుకును చదివించడానికి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని ఈడీ తరఫు న్యాయవాది వివరించారు. ఆమె కొడుకుకు ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోరారు.
Also read :
Kishan Reddy: రాజీనామా చేసి పార్టీ మారాలె
Whatsapp: మీ వాట్సాప్ పనిచేస్తుందా?

