సాయంత్రానికి రుణమాఫీ(Runa mafi) సొమ్ము రైతుల ఖాతాల్లో జమవుతాయని, ఊరూరా సంబురాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం అన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమల్లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చామని రైతులకు తెలియజేయాలని అన్నారు. ఇవాళ ప్రజాభవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏక బిగిన 31 వేల కోట్ల రూపాయల రుణాలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మాఫీ చేయలేదని, రేషన్ కార్డు లేని ఆరు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీని వర్తింపజేయనున్నామని సీఎం అన్నారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు లక్ష రూపాయల వరకు అప్పు ఉన్నవారి ఖాతాల్లో నగదు జమవుతాయని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి లక్షన్నర రూపాయల అప్పున్న వారి ఖాతాల్లో నగదు జమవుతాయన్నారు. ఆగస్టులో రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న కర్షకుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు చెప్పారు. ఆ వెంటనే బ్యాంకర్లు రైతులకు పంటరుణాలను మంజూరు చేస్తారని అన్నారు. ఈ రుణమాఫీ(Runa mafi) 20 ఏండ్ల వరకు గుర్తుండి పోయేలా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఏడు లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించి.. పైసా పైసా కూడబెట్టి తాము చేస్తున్న సాహసమిదని సీఎం అన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు తాను రైతులతో కనెక్ట్ అవుతానని, ఆ సమయానికి కర్షకులంతా రైతు వేదికల వద్దకు చేరుకునేలా చూడాలని కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. ఏడు నెలల వ్యవధిలో ప్రభుత్వం 30 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు.
గాంధీ కుటంబం మాటే శిలాశాసనం
వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని సీఎం చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ,, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పటికీ చెప్పుకొంటారని, రేపు రైతు రుణమాఫీ గురించి కూడా 20 ఏండ్లపాటు చెప్పుకోవాలని అన్నారు. రుణమాఫీ సంబురాలను ఊరూరా నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని రైతులకు వివరించాలన్నారు. రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిబెట్టుకున్నారని తెలుపాలన్నారు.
రైతులు, ప్రజల హృదయాలు గెలవాలి: భట్టి
రూ.7లక్షల కోట్ల అప్పుతో అధికార బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే హామీలు అమలు చేస్తున్నాం అనుకున్నంత ప్రచారం క్షేత్రస్థాయిలో జరగట్లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఆగస్టులోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే ఓట్ల కోసమే అనుకున్నారని.. వారి అంచనాలు తలకిందులు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వివరిస్తూ రైతులు, ప్రజల హృదయాలు గెలవాలని భట్టి అన్నారు.
ALSO READ :

