కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో మరోసారి వివాదం చెలరేగింది. ఇప్పటికే ద్వారపాలకుల విగ్రహాలకు సంబంధించిన బంగారం చోరీ ఘటనతో ఆలయం అపఖ్యాతి పాలైన విషయం ఇంకా మరిచిపోకముందే, ఇప్పుడు నైవేద్య నెయ్యికి సంబంధించిన స్కాం బయటపడింది. భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా ఈ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది.శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో నెయ్యాభిషేకం అత్యంత పవిత్రమైన ఆచారం. అయ్యప్ప స్వామికి నెయ్యితో చేసే అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయితే కొంతమంది భక్తులకు ప్రత్యక్షంగా నెయ్యాభిషేకం చేసే అవకాశం లభించదు. అలాంటి భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేకంగా ‘ఆదియా శిష్టం నెయ్యి’ని విక్రయిస్తుంది. ఈ నెయ్యిని అభిషేకం అనంతరం మిగిలిన నెయ్యితో తయారు చేస్తారు. దీనిని పవిత్ర ప్రసాదంగా భావించి భక్తులు ఎంతో భక్తితో కొనుగోలు చేస్తారు.
ఈ ఆదియా శిష్టం నెయ్యిని 100 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర 100 రూపాయలు. శబరిమల దేవస్థానం ఆధ్వర్యంలోని విక్రయ కౌంటర్లలో ఈ నెయ్యిని భక్తులకు అందిస్తారు. ప్రత్యేక ఆలయ అధికారి ఈ నెయ్యి స్టాక్‌ను విక్రయ కౌంటర్లకు సరఫరా చేసే బాధ్యత వహిస్తారు.అయితే తాజాగా జరిగిన విచారణలో దాదాపు 16 లక్షల రూపాయల విలువైన నెయ్యి ప్యాకెట్లు విక్రయ కౌంటర్ల నుంచి మాయమైనట్లు తేలింది. భక్తులు కొనుగోలు చేసిన నెయ్యికి సంబంధించిన మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేయలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అక్రమమని అధికారులు అనుమానిస్తున్నారు.విజిలెన్స్ అధికారుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెయ్యాభిషేకం అనంతరం మిగిలిన నెయ్యిని ప్యాకెట్లలో నింపే ప్రక్రియలోనూ అక్రమాలు జరిగాయని సమాచారం. నెయ్యి ప్యాకెట్ల తయారీ, నిల్వ, పంపిణీ విషయంలో రికార్డులు సరిగా నిర్వహించలేదని అధికారులు చెబుతున్నారు. కొంత నెయ్యి స్టాక్ రికార్డుల్లో ఉన్నా, వాస్తవంగా విక్రయ కౌంటర్లలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు రాకుండా గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో కొందరు అధికారులు ఈ అంశాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అయితే విజిలెన్స్ విభాగం మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.ఈ స్కాంపై శబరిమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విజిలెన్స్ విభాగానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్దవారైనా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్లారిటీ ఇచ్చారు.
Also read:

