గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు కాంగ్రెస్ (Congress) పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుల గణన సర్వే ను తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేయడంతో పాటు కులగణన ఫామ్ ను దహనం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్?(Congress) క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కులగణనపై అసెంబ్లీలో సాగిన చర్చలో మల్లన్న చేసిన వ్యాఖ్యలనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసన మండలిలో సైతం మల్లన్న కులగణన లెక్కలను ప్రశ్నించారు. ఈ పరిణామాల మధ్య కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. మల్లన్న ఇటీవల బీసీ నినాదం ఎత్తుకుని వరుసగా బీసీ సమావేశాలు నిర్వహిస్తూ రెడ్డి సామాజిక వర్గంపైన, సొంత పార్టీ రెడ్డి నేతలపైన ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా హనుమకొండలో నిర్వహించిన బీసీ సభలో రెడ్లపైన, పార్టీలోని రెడ్డి నాయకులపైన మల్లన్న చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఓ దశలో మాకు రెడ్లు, అగ్రకుల ఓట్లు వద్ధంటు..రెడ్లతో మాకు విడాకులంటూ..రెడ్లు అసలు తెలంగాణ వారే కాదంటూ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు.
రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న చేసిన విమర్శల పట్ల పోలీసులకు పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ పరిణామాలన్నీ చివరకు మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసే వరకు దారితీశాయి. మల్లన్న సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో ఆయనపై వేటు వేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మల్లన్న కులగణనను తప్పుబడుతూ విమర్శలు చేయడం ప్రజల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వేపై అనుమానాలను, అపోహలను పెంచేసిందనే వాదన పార్టీలో బలంగా ఉంది. కాంగ్రె క్రమశిక్షణా సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు మల్లన్న ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
నాకు నోటీసు అందలే
తీన్మార్ మల్లన్న
తనకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నుంచి ఎలాంటి షోకాజ్ నోటీసు రాలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. పార్టీ షో కాజ్ నోటీస్ ఇస్తే స్పందిస్తానని, నోటీసుకు వివరణ ఇస్తానని చెప్పారు. కొందరు అగ్రవర్ణాల వారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను అనని మాటలను అన్నట్టు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. తనకు నోటీస్ ఇవ్వరనే అంనుకుంటున్నానని చెప్పారు.
Also read:

