భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాల్లో ఒకటి ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తారాగణం గురించి సమాచారం బయటకు రావడంతో ఆసక్తి మరింత పెరిగింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండగా, కైకేయి పాత్రలో లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.
ఇక అందరిలోనూ అత్యంత ఆసక్తి రేకెత్తించిన పాత్ర (Hanuman) హనుమంతుడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర అపారమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠకు ఇప్పుడు తెరలేపబడింది. బాలీవుడ్ యాక్షన్ హీరో (Hanuman) సన్నీదేవోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారని అధికారికంగా వెల్లడైంది.
తాజాగా సన్నీదేవోల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హనుమంతుడి పాత్ర చేయడం తనకు గర్వకారణమని తెలిపారు. “ఈ పాత్రలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంతో పాటు ఒకింత భయమూ ఉంది. ఎందుకంటే ఇలాంటి పాత్రలు సవాలు విసురుతాయి. పాత్రలో జీవించాల్సిన అవసరం ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. ఇంకా తన పాత్ర చిత్రీకరణ ప్రారంభం కాలేదని, కానీ సిద్ధతలో ఉన్నానని తెలిపారు.
రూ. 4 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడానికి చిత్రబృందం శ్రమిస్తున్నదని సన్నీదేవోల్ వివరించారు. ప్రేక్షకులకు విభిన్నమైన విజువల్ అనుభూతి కలిగించడానికి ప్రత్యేక సాంకేతికతలు ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. రామాయణం లాంటి మహాకావ్యాన్ని ఎన్నిసార్లు తెరపైకి తీసుకువచ్చినా ప్రతీసారి కొత్తదనమే ఉంటుందని అన్నారు.
అలాగే రణ్‌బీర్ కపూర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “రణ్‌బీర్ గొప్ప నటుడు. ఆయన రాముడి పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెరపై అతడిని చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది” అని సన్నీదేవోల్ అన్నారు.
ఇప్పటికే యశ్ రావణుడి లుక్‌పై భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న వార్త వెలువడినప్పటి నుంచి ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక సన్నీదేవోల్ హనుమంతుడిగా నటిస్తాడని అధికారికంగా తెలిసిన తరువాత, ఈ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
రామాయణం భారతీయ సాంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే మహాకావ్యం. ఆ మహాకావ్యాన్ని ఆధునిక సాంకేతికతలతో ప్రపంచ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ ప్రాజెక్ట్ విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also read:
- Rajagopal:రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు? – టీపీసీసీ చీఫ్ స్పందన
- RS Praveen Kumar: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర