T20 World cup: భారత్ మ్యాచ్‌కు పాక్ ఓకే

భారత్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్(T20 World cup) మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం చివరకు వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. భారత్–పాక్ మ్యాచ్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కు సుమారు 174 మిలియన్ డాలర్ల ఆదాయం నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది. ఇందులో టీవీ ప్రసార హక్కులు, టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్ ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా ఉన్నాయి.

భారత్–పాక్ మ్యాచ్ ఖరారైన వెంటనే ప్రయాణ రంగంపై కూడా దీని ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ముంబై–కొలంబో రౌండ్ ట్రిప్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కొన్ని రూట్లలో టికెట్ ధరలు రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు పెరిగినట్టు సమాచారం. క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున ప్రయాణాలు ప్లాన్ చేయడంతో ఈ డిమాండ్ పెరిగిందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా, తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తామని గట్టిగా ప్రకటించింది. శ్రీలంకలో మ్యాచ్ ఆడాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థన తిరస్కరణకు గురికావడంతో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకురావాలని కూడా నిర్ణయించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య తెరవెనుక కీలక చర్చలు సాగాయి.(T20 World cup)

ఈ పరిణామాల మధ్య నిన్న రాత్రి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను ఆడాలని పాకిస్థాన్‌ను కోరినట్లు వెల్లడించింది. ఈ సమయంలో పాకిస్థాన్ చేసిన సహకారానికి బంగ్లాదేశ్ కృతజ్ఞతలు కూడా తెలిపింది. అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.

స్నేహపూర్వక దేశాల విజ్ఞప్తులు, ఐసీసీతో జరిగిన చర్చల ఫలితంగా భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాక్ ప్రభుత్వం తన జట్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు ఊరట చెందుతున్నారు. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్–పాక్ మ్యాచ్ ఇప్పుడు అధికారికంగా జరగనుండటంతో, టీ20 వరల్డ్ కప్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Also Read: