Telangana Bandh: మార్వాడీ గో బ్యాక్ బంద్ విజయవంతం

Telangana Bandh

తెలంగాణలో (Telangana Bandh) “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఓయూ జేఏసీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు (Telangana Bandh) జిల్లాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని హబ్సిగూడ ప్రాంతంలో ఓయూ జేఏసీ విద్యార్థులు ఒక మార్వాడీ షాపు ముందు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్, సిద్దిపేటలో ప్రభావం

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్‌ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పలు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్లు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జేఏసీ నాయకుల పిలుపుతో పట్టణ వ్యాప్తంగా బంద్ కొనసాగింది.

రంగారెడ్డి, మహబూబాబాద్‌లో బంద్

రంగారెడ్డి జిల్లా అమనగల్‌లో కిరాణా, వస్త్ర, వర్తక వ్యాపారులు, స్వర్ణకారులు బంద్‌లో పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలో కూడా ఉద్యమం విస్తరించింది. సెల్‌ఫోన్ షాపుల నిర్వాహకులు “గో బ్యాక్ మార్వాడీ” నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. నెహ్రూ సెంటర్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం

“మార్వాడీ గో బ్యాక్” ఉద్యమం మొదట సోషల్ మీడియాలో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు అది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి తీవ్రరూపం దాల్చింది. స్థానిక వ్యాపారులు మార్వాడీలు ముఠాగా ఏర్పడి తమ వ్యాపారాలపై ఆధిపత్యం చూపుతున్నారని, ఎదగనీయడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో వారు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓయూ జేఏసీ చైర్మన్ అరెస్ట్

ఉద్యమానికి ఊపందించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21 అర్ధరాత్రి, ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్, పీహెచ్‌డీ హాస్టల్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. “గో బ్యాక్ మార్వాడీ, గో బ్యాక్ గుజరాతి రాజస్థాన్” నినాదాలతో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తిరుపతిని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అతని అరెస్టు నేపథ్యంలో ఉద్యమానికి మరింత మద్దతు లభించింది.

భవిష్యత్తు దిశ

ప్రస్తుతం ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటికీ వ్యాపిస్తోంది. పోలీసు చర్యలు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ, స్థానిక వ్యాపారుల మద్దతుతో “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమం మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: