Telangana: ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీకి రేవంత్ సర్కార్ శ్రీకారం

Telangana

సామాన్యులు, పేదలు, అల్ప ఆదాయ మరియు మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ రెడ్డి (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి తక్కువ ధరలకే ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో (Telangana) తెలంగాణ ప్రభుత్వం ‘ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని రూపొందిస్తోంది. ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను ఫిబ్రవరి నెలాఖరులోగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పాలసీ రూపకల్పన కోసం ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ ప్రక్రియ ద్వారా ఇప్పటికే సీబీఆర్‌ఐ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసింది. ఇటీవల ఈ సంస్థతో గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు సమావేశమై పాలసీలో ఉండాల్సిన విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. మార్చి చివరి నాటికి తుది పాలసీని సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. అనంతరం కేబినెట్ ముందు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Housing: Telangana government allocates Rs 11,917 crore for 2-bhk project,  ETGovernment

తెలంగాణ రైజింగ్ విజన్–2047లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం గృహ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు అధికారులు.ఈ ఎఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను మొత్తం మూడు దశల్లో నిర్మించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న మురికివాడల ప్రాంతాల్లోనే బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే హైదరాబాద్ ఫోర్త్ సిటీగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలోనూ భారీ స్థాయిలో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టనుంది.

టైర్–2 పట్టణాల్లోనూ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మార్గదర్శకాలను రూపొందిస్తోంది ప్రభుత్వం. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పూర్వ జిల్లాల పరిధిలో గృహనిర్మాణశాఖకు చెందిన భూములను ఇప్పటికే గుర్తించారు. అక్కడ గృహ సముదాయాలు నిర్మించి మధ్యతరగతి వర్గాలకు సరసమైన ధరలకు ఇళ్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త పాలసీపై మధ్యతరగతి వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఈ నిర్ణయంతో తక్కువ ధరకే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ ఎఫర్డబుల్ హౌసింగ్ నిర్ణయం రాష్ట్రంలో గృహ రంగానికి కొత్త దిశ చూపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Also read: