ఇప్పటివరకు వాహన రిజిస్ట్రేషన్ అనగానే (Telangana) ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుడు, ఫైళ్ల కట్టలు, గంటల తరబడి క్యూ లైన్లు, బ్రోకర్లు, ఏజెంట్లతో నరసమానంగా మారిన అనుభవాలే చాలామందికి గుర్తొచ్చేవి. కానీ ఇకపై అలాంటి టెన్షన్లకు పూర్తిస్థాయిలో చెక్ పడనుంది. (Telangana) తెలంగాణ ప్రభుత్వం రవాణా సేవలను పూర్తిగా డిజిటల్ మార్గంలోకి తీసుకువస్తూ వాహన్ పోర్టల్‌తో అనుసంధానం కావడానికి సిద్ధమవుతోంది. మార్చి 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త వ్యవస్థతో వాహనదారుల పనులు చిటికెలో పూర్తయ్యే పరిస్థితి రానుంది.

తెలంగాణ రవాణా రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రం సొంత ఐటీ వ్యవస్థపై ఆధారపడి పనిచేసిన తెలంగాణ రవాణా శాఖ, ఇప్పుడు జాతీయ స్థాయి నెట్‌వర్క్‌లో భాగం కానుంది. ఇప్పటికే లైసెన్సులు, డ్రైవింగ్ సంబంధిత సేవల కోసం సారథి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్‌ను అమల్లోకి తీసుకొస్తోంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ” భావన వాస్తవ రూపం దాల్చనుంది.

ఈ మార్పుతో వాహనదారులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో వాహనం కొనుగోలు చేసి మరో రాష్ట్రానికి తీసుకెళ్లే వారికి ఇది అతిపెద్ద ఊరటగా మారనుంది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనం తెచ్చుకున్నా, లేదా తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రానికి మార్చాలన్నా NOC కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై వాహనాల డేటా మొత్తం కేంద్ర సర్వర్‌లో ఉండటం వల్ల ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సెకన్ల వ్యవధిలో పూర్తవుతుంది.
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ కొత్త వ్యవస్థ మరింత భద్రతను కల్పించనుంది. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా? గతంలో ఏవైనా నేరాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా? వంటి వివరాలను ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ ఆధారంగా వాహన్ పోర్టల్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. దీని వల్ల మోసపూరిత లావాదేవీలకు అడ్డుకట్ట పడనుంది.
ఇక ఆర్టీఏ సేవలను ఇంటి నుంచే పొందే అవకాశం కూడా ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానుంది. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపోథికేషన్ రద్దు వంటి పనుల కోసం ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. బ్రోకర్ల బెడద, గంటల తరబడి వేచి ఉండే పరిస్థితులు పూర్తిగా తొలగిపోనున్నాయి. అంతేకాదు, ఫిజికల్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లోని డిజిటల్ ఆర్సీకి పూర్తి చట్టబద్ధత ఉంటుంది.
నేర నియంత్రణలో కూడా ఈ వాహన్ పోర్టల్ కీలక పాత్ర పోషించనుంది. వాహన దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఇది పోలీసులకు ఒక బ్రహ్మాస్త్రంలా మారనుంది. తెలంగాణలో దొంగిలించిన వాహనాన్ని ఇతర రాష్ట్రాల్లో విక్రయించేందుకు ప్రయత్నించినా, జాతీయ స్థాయి నెట్‌వర్క్ కారణంగా ఆ వాహన వివరాలు వెంటనే బయటపడతాయి. దీంతో నేరస్తులను పట్టుకోవడం మరింత సులభమవుతుంది.
మొత్తానికి మార్చి 15 నుంచి అమల్లోకి రానున్న వాహన్ పోర్టల్, తెలంగాణ రవాణా వ్యవస్థను పూర్తిగా కొత్త దిశలో నడిపించనుంది. వాహనదారులకు సౌలభ్యం, పారదర్శకత, భద్రత అందించే ఈ మార్పు, రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని చెప్పవచ్చు.
Also read:

