Venkata Rao: కాంగ్రెస్ లోకి తెల్లం

venkata rao

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Venkata Rao) కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఆ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కారులో మిగలలేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మె్ల్యేలు, కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు పలువురు అనుచరులు కూడా కాంగ్రెస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్నుంచి తెల్లంవెంకట్రావు మాత్రమే గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై ఆయన విజయం సాధించారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొంతకాలంగా సొంత పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ కార్యక్రమం, పార్లమెంట్‌ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు దూరంగా ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా పేరున్న తెల్లం వెంకట్రావ్ .. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరేలా తరచూ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అవ్వడం, కాంగ్రెస్ లీడర్లతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. ఇటీవల మంత్రి తుమ్మల సమక్షంలో జరిగిన మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సమీక్షా సమావేశానికి హాజరవడంతోపాటు, ఇటీవల మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో, నిన్న తుక్కుగూడ జనజాతర సభలోనూ తెల్లం పాల్గొన్నారు. ఇవాళ అధికారికంగా సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Also read: