TSRTC: ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలకు పరిష్కారం

TSRTC

హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ (TSRTC) సమస్యలు కూడా తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలకు రోజూ లక్షలాది మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు (TSRTC) టీఎస్ఆర్టీసీ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ‘గర్‌లక్ష్మీ ఇన్ఫోబాన్’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ నగర ప్రజా రవాణాలో మరో కీలక ముందడుగు వేసింది.

Image

ఈ కొత్త బస్సు సర్వీసులు ప్రధానంగా హయత్‌నగర్, ఎల్‌బీ నగర్ వంటి తూర్పు హైదరాబాద్ ప్రాంతాల నుంచి నేరుగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ప్రయాణించేలా రూపకల్పన చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండటంతో, ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకే కాకుండా రాత్రి ఆలస్యంగా తిరిగివచ్చే వారికి కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. మార్గమధ్యలో మార్పిడి బస్సులు ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం ఈ సేవల ప్రత్యేకత.

Image

ప్రధాన రూట్లు ఇలా…

156/316 రూట్:
ఈ బస్సు ఎల్‌బీ నగర్ నుంచి ప్రారంభమై కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, నార్సింగి, కోకాపేట మీదుగా గర్ (Gachibowli ORR Exit), కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ సర్కిల్, ఐఐఐటీ మార్గంగా గచ్చిబౌలి చేరుకుంటుంది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికి ప్రధాన ఐటీ హబ్‌లకు నేరుగా కనెక్టివిటీ లభించనుంది.

Image

300/316 రూట్:
హయత్‌నగర్ నుంచి బయల్దేరే ఈ బస్సు ఎల్‌బీ నగర్, సాగర్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, హైదర్‌గూడ, నార్సింగి, కోకాపేట సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్‌రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలి చేరుకుంటుంది. ఈ మార్గం ద్వారా సుమారు 40కి పైగా ప్రాంతాల ప్రజలకు నేరుగా ఐటీ కారిడార్‌కు చేరుకునే అవకాశం లభిస్తోంది.

Image

ఐటీ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి

ప్రస్తుతం గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. వాహనాల సగటు వేగం కేవలం 12 నుంచి 15 కిలోమీటర్లకు పరిమితమవుతోంది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 8 గంటల సమయంలో వాహనాలు దాదాపు 1.8 కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. ఈ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఐటీ కారిడార్‌లో 500 బస్సులను నడుపుతోంది. వీటిలో 200 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా త్వరలో మరో 275 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఉద్యోగులకు లాభాలు

వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లపై ఆధారపడటం వల్ల వచ్చే అధిక ఖర్చు, మానసిక ఒత్తిడిని ఈ ఇన్ఫోబాన్ సర్వీసులు గణనీయంగా తగ్గించనున్నాయి. నేరుగా ఆఫీసు ప్రాంతాలకు చేరుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని, ఉద్యోగుల పనివేళలకు అనుగుణంగా షెడ్యూళ్లను రూపొందించామని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గాలంటే ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ఈ సౌకర్యవంతమైన ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read: