యాసంగి సీజన్ ప్రారంభమవుతుందంటే చాలు తెలంగాణ రైతులు ముందుగా గుర్తు చేసుకునేది (urea app) యూరియా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చేసరికి పంటల సాగు కోసం రైతులు ఎరువుల షాపుల వైపు పరుగులు పెడతారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు ఎరువుల దుకాణానికి వెళ్లి నేరుగా యూరియా కొనుగోలు చేసిన రైతులు, ఇప్పుడు తప్పనిసరిగా మొబైల్ యాప్ (urea app) ద్వారానే యూరియా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ, “యాప్ ద్వారానే యూరియా” అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త విధానం రైతుల ముందుకు రెండు ప్రధాన సవాళ్లను తెచ్చింది. మొదటి సమస్య స్మార్ట్ ఫోన్. ఇప్పటికీ చాలా మంది రైతుల వద్ద స్మార్ట్ మొబైల్ ఫోన్ లేదు. యూరియా కోసం తప్పనిసరిగా యాప్ కావడంతో, కొందరు రైతులు అప్పులు చేసి మరీ ఫోన్ కొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఫోన్ కొనడం ఒక భారమైతే, ఇంటర్నెట్ డేటా కోసం నెలకు ఖర్చు మరో భారంగా మారింది. రెండో సమస్య యాప్ వాడకం. స్మార్ట్ ఫోన్ ఉన్నా, యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా బుక్ చేయాలి అనే విషయాల్లో చాలామందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ప్రభుత్వం ఈ యాప్ విధానం ఎందుకు తీసుకొచ్చిందంటే, రైతులు ఎంత భూమిలో సాగు చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకొని, వారికి అవసరమైనంత యూరియా మాత్రమే అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వానికి ఇప్పటికే రైతుల భూమి విస్తీర్ణం, పంటల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అవసరానికి మించి యూరియా కావాలంటే, యాప్ ద్వారా బుక్ చేయడం సాధ్యం కాదు. దీంతో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే యాప్ ద్వారా బుకింగ్ చేస్తే టైమ్ ప్రకారం డీలర్ వద్ద యూరియా అందుబాటులో ఉండి, రైతుల సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు వివరిస్తున్నారు.

ఈ యాప్ పేరు “Fertilizer” లేదా “Fertilizer Booking App”. గూగుల్ ప్లే స్టోర్‌లో “Fertilizer”, “Urea App” అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం రైతు రకం ఎంచుకోవాలి. అంటే పట్టాదారు, కౌలు రైతు లేదా భూమి లేని రైతు అనే ఆప్షన్లలో సరైనదాన్ని సెలెక్ట్ చేయాలి. భూమి ఉన్న రైతులు పట్టాదారు పాస్‌బుక్ నంబర్ లేదా ఆధార్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

తర్వాత సీజన్ ఎంపిక చాలా ముఖ్యం. యాసంగి పంట కోసం రబీ సీజన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత జిల్లా, పంట వివరాలు నమోదు చేస్తే, సమీప డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. ప్రభుత్వం నిర్ణయించిన అర్హత ప్రకారం బస్తాల సంఖ్య చూపిస్తుంది. వాటిని బుక్ చేస్తే ఒక బుకింగ్ ఐడీ వస్తుంది. ఆ ఐడీతో 24 నుంచి 48 గంటలలోపు డీలర్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవాలి. ఆలస్యం అయితే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ప్రస్తుతం యాప్‌లో ఆన్‌లైన్ పేమెంట్ సదుపాయం లేదు. డీలర్ దగ్గరికి వెళ్లినప్పుడు క్యాష్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.

భూమి విస్తీర్ణం, పంట రకం ఆధారంగా యూరియా బస్తాలు కేటాయిస్తున్నారు. వరికి ఎకరానికి 2.5 నుంచి 3 బస్తాలు, మొక్కజొన్నకు 3.5 నుంచి 4 బస్తాలు, మిరప పంటకు 5 బస్తాలు, ఇతర పంటలకు సగటున 2 బస్తాలు ఇస్తున్నారు. ఒకసారి యూరియా తీసుకున్న రైతులు మళ్లీ బుక్ చేసుకోవాలంటే కనీసం 15 రోజులు వేచి చూడాలి. ఈ విధానం వల్ల డీలర్ల వద్ద క్యూలు తగ్గినప్పటికీ, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు మాత్రం ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అలాంటి రైతుల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) SMS విధానం ద్వారా సహాయం అందిస్తున్నారు. మొత్తం మీద యూరియా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Also read:

