టాలీవుడ్ స్టార్ హీరో (Vijay Deverakonda) విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహబంధంతో ఒక్కటైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇవాళ ఉదయం 10.10 గంటలకు (Vijay Deverakonda) విజయ్, రష్మిక మెడలో మూడుముళ్లు వేసినట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో ఈ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని రెండు కుటుంబాల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా నిర్వహించినట్లు సమాచారం. ఉదయం విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో వివాహం జరగ్గా, సాయంత్రం 4.30 గంటలకు రష్మిక కర్నాటకలోని కొడవ సంప్రదాయం మేరకు మరోసారి వివాహ కార్యక్రమం నిర్వహించనున్నారని చెబుతున్నారు.
సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరైనట్లు సమాచారం. పెళ్లి సంబరాల్లో భాగంగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో సరదాగా ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించినట్లు జంట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న విషయం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. బుధవారం హల్దీ వేడుకను కూడా ఘనంగా నిర్వహించినట్లు తెలిసింది. వివాహ విందు కార్యక్రమాన్ని మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇక సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. రష్మిక, విజయ్ పెళ్లి దుస్తుల్లో ఉండగా, వారితో పాటు మహేశ్ బాబు, అల్లు అర్జున్ కలిసి ఉన్నట్లు కనిపించిన ఆ ఫోటో అసలైనది కాదని తేలింది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఏఐ చిత్రం అని నెటిజన్లు గుర్తించారు. ఫోటో నిజమైనదిలా కనిపించినప్పటికీ, అది ఏఐ సృష్టి అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు విజయ్ రూపం సహజంగా లేదని, మరికొందరు మహేశ్ బాబు అందాన్ని ఏఐ సరిగా పట్టలేకపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు.
అభిమానులు ప్రేమగా ఈ జంటకు పెట్టిన పేరు ‘విరోష్’. ఆ పేరును గౌరవిస్తూ తమ వివాహాన్ని ‘విరోష్ వెడ్డింగ్’గా పేర్కొన్నట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. “మేము ఏ ప్లాన్ చేయకముందే మీరు మాకు ఒక పేరు ఇచ్చారు. అదే విరోష్. మా వివాహాన్ని మీ ప్రేమకే అంకితం చేస్తున్నాం” అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితంలో అభిమానులు ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటారని ఈ జంట స్పష్టం చేసింది.

