Modi: బ్లాక్ మెయిల్ కు బెదరం

Modi

బ్లాక్‌ మెయిల్‌కు భారత్‌ తలవంచే రోజులు పోయాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటామని అన్నారు. (Modi) అణుబాంబు బెదిరింపులను సహించేది లేదంటూ పాకిస్తాన్ కు వార్నింగ్‌ ఇచ్చారు. ఆత్మనిర్భర్‌ అంటే డాలర్‌, పౌండ్‌పై ఆధారపడటం కాదని పరోక్షంగా అమెరికా, బ్రిటన్ లనూ టార్గెట్ చేశారు.

Image

అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్‌.. ఇప్పుడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోందని చెప్పారు. తిండిగింజల కోసం ఇబ్బందిపడిన మనం ఇప్పుడు ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని అన్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేసేది లేదన్నారు.

స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదని, సమున్నతంగా నిలబడటమని అన్నారు. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదని, మేకిన్‌ ఇండియా ఏంటో ఆపరేషన్‌ సిందూర్‌ చాటి చెప్పిందని తెలిపారు. భారత్‌లో తయారీ నినాదం రక్షణరంగంలో మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోందన్నారు.

భారత్‌ సమున్నత శక్తిగా ఎదుగుతోందని, ఇవాళ ప్రపంచం భారత్‌ను విస్మరించలేదని తెలిపారు. టెక్నాలజీ కోసమో, సాయం కోసమో భారత్ ప్రపంచాన్ని అర్థించట్లేదన్నారు. సెమీ కండక్టర్లు సహా అనేక విషయాల్లో సొంత కాళ్లపై నిలబడుతోందని తెలిపారు. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉందని, త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయని అన్నారు.

దీపావళి నాటికి ధరల తగ్గుదల
జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్తు్న్నామని ప్రధాన మంత్రి అన్నారు. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయని అన్నారు. సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తామని చెప్పారు. సామాన్యులపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ తో బుద్ధి చెప్పాం
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి ఆపరేషన్‌ సిందూర్‌తో బుద్ది చెప్పామని అన్నారు. పాక్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని, మన సైన్యం పాక్‌ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన దేశ సత్తా చాటామని తెలిపారు.

‘ఆపరేషన్‌ సిందూర్‌ హీరోలకు నా సెల్యూట్‌. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు.’అని మోదీ ప్రశంసలు కురిపించారు.

రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు
ఇకపై ఎవరి బ్లాక్‌ మెయిల్‌ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడితే దీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి.

ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు.’ అని అన్నారు.

Also read: