డబ్ల్యూపీఎల్ తొలి పోరులో ముంబై గ్రాండ్ విక్టరీవరల్డ్ క్రికెట్ ఆసక్తిగా ఎదురుచూసిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)WPLకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోకుండా బౌండ్రీలు, సిక్సర్లతో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్.. ఫ్రాంచైజీ క్రికెట్ మజాను మరోసారి చూపెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బాల్స్‌లో 14 ఫోర్లతో 65) బ్యాటింగ్ షో చేయగా, బౌలర్లందరూ అంచనాలు అందుకోవడంతో.. మెగా లీగ్‌లో ముంబై బోణీ చేసింది. వందల కోట్లతో ఫ్రాంచైజీని దక్కించుకుని, భారీ బలగంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ మాత్రం గ్రౌండ్‌లో తేలిపోయింది.
నవీ ముంబై(MUMBAI): ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్.. డబ్ల్యూపీఎల్‌లో బోణీ చేసింది. కెప్టెన్ హర్మన్‌కు తోడుగా హీలీ మాథ్యూస్ (31 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47), అమెలియా కెర్ర్ (24 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 143 రన్స్ భారీ తేడాతో గుజరాత్ జెయింట్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 207/5 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్ 15.1 ఓవర్లలో 64 రన్స్‌కు ఆలౌటైంది. ముంబై బౌలర్ల దెబ్బకు ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్ కాగా, ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హర్మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ముగ్గురు దంచిన్రు..పిచ్ ఫ్లాట్‌గా ఉండటం, లైనప్‌లో స్టార్లు ఉండటంతో.. ముంబై ఇన్నింగ్స్ వాయువేగంతో ముందుకెళ్లింది. రెండో ఓవర్‌లో మాథ్యూస్ సిక్స్, ఫోర్‌తో ఖాతా తెరిస్తే.. మూడో ఓవర్‌లో యాస్తికా భాటియా (1) ఓటైంది. ఈ దశలో వచ్చిన సివర్ (23) ఉన్నంతసేపు దంచికొట్టింది. ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో ముంబై 44/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌లో సివెర్ బౌండ్రీ రాబడితే, 8వ ఓవర్‌లో మాథ్యూస్ మూడు సిక్సర్లతో రెచ్చిపోయింది. కానీ 9వ ఓవర్‌లో సివర్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 54 పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. 10వ ఓవర్ లాస్ట్ బాల్‌కు మాథ్యూస్ కూడా వెనుదిరగడంతో తొలి పది ఓవర్లలో ముంబై 77/3 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ విశ్వరూపం చూపెట్టింది. స్నేహ్ రాణా (2/43) బౌలింగ్‌లో రెండు వరుస బౌండ్రీలతో టచ్‌లోకి వచ్చిన కౌర్.. 12వ ఓవర్‌లో మూడు, తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదితే మధ్యలో కెర్ కూడా రెండు ఫోర్లతో రెచ్చిపోయింది. 15వ ఓవర్‌లో ఇద్దరు కలిసి ఐదు ఫోర్లతో 21 రన్స్ రాబట్టడంతో స్కోరు 145/3గా మారింది. 16వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టిన కౌర్.. తర్వాతి ఓవర్‌లో బౌండ్రీ సాధించి ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 89 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అయినా ముంబై స్పీడు తగ్గలేదు. 18వ ఓవర్‌లో కెర్ రెండు ఫోర్లు బాదితే, 19వ ఓవర్‌లో పూజా (15) మూడు బౌండ్రీలు సాధించింది. ఆఖరి ఓవర్లో పూజా ఔటైనా.. కెర్, ఇసీ వాంగ్ (6 నాటౌట్) చెరో సిక్సర్ కొట్టడంతో ముంబై స్కోరు 200 మార్కు దాటింది.