మిజోరాం రాజధాని (Aizawl) ఐజ్వాల్‌కి చివరకు భారత రైల్వే మ్యాప్‌లో స్థానం దక్కింది. ఈ చారిత్రక సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “దేశ అభివృద్ధి పథంలో మిజోరాం కీలక మలుపు”గా అభివర్ణించారు. మిజోరాంలో సుమారు రూ. 9,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు (Aizawl) ప్రధాని శంకుస్థాపన చేశారు.
రెండు రోజుల ఈశాన్య పర్యటనలో భాగంగా మోదీ శనివారం ఉదయం ఐజ్వాల్ చేరుకున్నారు. భారీ వర్షం కారణంగా లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఐజ్వాల్ లోని లమ్మువల్ గ్రౌండ్ చేరుకోలేకపోయినా, పర్యటనలోని ప్రధాన కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైరాంగ్–ఆనంద్ విహార్ రాజధాని ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా–సైరాంగ్–కోల్‌కతా ఎక్స్‌ప్రెస్, గౌహతి–సైరాంగ్–గౌహతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు మిజోరాం ప్రజలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసి, రవాణా సౌలభ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు.
మోదీ మాట్లాడుతూ – “ఈశాన్య రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజన్లు. ఆర్థిక కారిడార్ లో మిజోరాం ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఐజ్వాల్ రైల్వే లైన్‌కు పునాది వేసే అవకాశం నాకు దక్కింది. ఈ రోజు దాన్ని దేశ ప్రజలకు అంకితం చేయడం గర్వంగా ఉంది” అని అన్నారు.
ప్రధాని మోదీ మిజో సమాజంలోని విలువలను ప్రస్తావిస్తూ – “త్యాగం, సేవ, ధైర్యం, కరుణ – ఇవే మిజో సంస్కృతికి బలమైన ఆధారం” అని పేర్కొన్నారు.
ఈ కొత్త రైల్వే లైన్ వల్ల మిజోరాంలోని రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లకు తీసుకెళ్లగలరని, విద్య మరియు ఆరోగ్య సేవలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. రైల్వే కనెక్టివిటీతో పర్యాటకం, ఆతిథ్య రంగం, రవాణా విభాగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈశాన్య ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వం ప్రాధాన్యతలో ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ఐజ్వాల్ రైల్వే కనెక్షన్ ఆ ప్రయాణంలో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.