సీబీఐ కస్టడీలో ఉన్న కవితను (Kavitha) ఇవాళ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది బీజేపీ కస్టడీ.. బయట బీజేపీ వాళ్లు మాట్లాడేదే సీబీఐ వాళ్లు అడుగుతుండ్రు.. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్రు.. ఇది టోటల్ ఫర్జీ కేసు’ అని పేర్కొన్నారు. విచారణ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీహార్ జైలుకు కవిత
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని పేర్కొంటూ కోర్టుకు సీబీఐ 11 పేజీల అప్లికేషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 23 వరకు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. మూడు రోజుల కస్టడీలో కవిత తమకు సహకరించలేదని చెప్పారు. సంబంధం లేకుండా, తమను తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించగా స్పందించడం లేదన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి రెండు దఫాలుగా తీసుకున్న 14 కోట్లపైనా ప్రశ్నించామని అన్నారు. మహబూబ్ నగర్ లో లేని భూమిని ఉన్నట్టు చూపించి అమ్మేసిన విషయాలను అడిగామని అన్నారు. దేనికీ కవిత సరైన సమాధానం చెప్పలేదని, ఉద్దేశ పూర్వకంగానే తమను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఆమె సాక్షులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని, కేసు దర్యాప్తు వేగంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆమె బయట ఉంటే ప్రమాదకరమని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతోపాటు చెరిపేసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కేసులో డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. జ్యుడీషియల్ రిమాండ్ అవసరం లేదని, ఇప్పటికే సీబీఐ అధికారులు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగారని తెలిపారు. విచారణ ప్రక్రియ ముగిసినందున జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత 9 రోజుల పాటు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవితను జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈడీ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఒక వేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఆమె తీహార్ జైల్లోనే ఉంటారు. సీబీఐ కేసులో ఆల్ రెడీ రిమాండ్ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. ఈడీతోపాటు సీబీఐ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆమె బయటికి వస్తారని న్యాయనిఫుణులు చెబుతున్నారు.
Also read:

