కేరళ (Kerala) రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనానికి బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా అనుకోని ప్రమాద పరిస్థితి తలెత్తింది. (Kerala)హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ భాగం బరువును తట్టుకోలేక ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వేగంగా స్పందించి హెలికాప్టర్‌ను చేతులతో నెట్టుతూ సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం తిరువనంతపురానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆమె శబరిమల శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ దర్శనానికి వెళ్లారు. రాజ్‌భవన్ నుంచి ఉదయం 7.25 గంటలకు బయలుదేరిన కాన్వాయ్ విమానాశ్రయం చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శబరిమల హెలిప్యాడ్‌కు చేరుకున్న వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలిప్యాడ్ నేల కుంగిపోవడంతో భద్రతా సిబ్బంది తక్షణమే పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం అదృష్టకరం. వెంటనే రాష్ట్రపతి భద్రతా విభాగం మొత్తం హెలిప్యాడ్ ప్రాంతాన్ని మూసివేసి తనిఖీలు నిర్వహించింది.
తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంబా మార్గం ద్వారా అయ్యప్ప స్వామివారి సన్నిధానానికి చేరుకున్నారు. ఆమెతో పాటు ఐదు వాహనాల కాన్వాయ్, అత్యవసర అంబులెన్స్ కూడా వెళ్లింది. భక్తులు, అధికారులు, అర్చకులు రాష్ట్రపతిని ఘనంగా ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనం అనంతరం ఆమె అయ్యప్పుడి ఆశీస్సులు తీసుకున్నారు.
భద్రతా పరంగా అధికారులు ముందుగానే కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించినప్పటికీ, హెలిప్యాడ్ నిర్మాణంలో బలహీనత కారణంగా ఈ అనుకోని ఘటన జరిగిందని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం హెలిప్యాడ్ పరిస్థితిని పరిశీలిస్తోంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రపతి పర్యటనలో చిన్నతరహా ప్రమాదం సంభవించినా, సిబ్బంది అప్రమత్తత, వేగవంతమైన చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమై, నెటిజన్లు భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.
Also read:

