Mahoba : స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు… దాన్ని దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లడంతో తాత, మనుమడు చనిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబాలో జరిగింది. మహోబాకు చెందిన ఉదిత్ నారాయణ్ చౌరాసియా(66) రిటైర్డ్ టీచర్. ఆయన శనివారం తన మనుమడు సాత్విక్ (6)తో కలిసి స్కూటీపై లోకల్ మార్కెట్ కు బయలుదేరారు. కాన్పూర్– సాగర్ హైవేపై వెళ్తుండగా, బీజానగర్ కు సమీపంలో వీళ్ల స్కూటీని ట్రక్కు ఢీకొట్టింది.
స్కూటీతో పాటు వాళ్లిద్దరూ ట్రక్కు కింద చిక్కుకోగా.. ట్రక్కు డ్రైవర్ చూడకుండా దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. స్థానికులు వెంబడించి ట్రక్కును ఆపి, డ్రైవర్ ను చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరూ చనిపోయారు. బాడీలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.