కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి వాణిజ్య న్యాయస్థానం అమెరికాకు చెందిన ఏఐ సంస్థ AnthropicAI పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసులో సమన్లు జారీ చేసింది. రాష్ట్రానికి చెందిన Anthropic Software Private Limited దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16న హాజరుకాని అమెరికన్ సంస్థ ప్రతినిధులు తప్పనిసరిగా మార్చి 9న కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఫిర్యాదు ప్రకారం, 2017లో స్థాపించబడిన భారత సంస్థ “అంత్రోపిక్” పేరుతో ముందుగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, అమెరికన్ కంపెనీ అదే పేరుతో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడిందని ఆరోపించింది. దీంతో తమ బ్రాండ్ గుర్తింపు దెబ్బతింటోందని సంస్థ పేర్కొంది.
భారత సంస్థ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ Mohammed Ayaz Mulla మాట్లాడుతూ, “మేమే ఈ పేరును ముందుగా వినియోగించిన సంస్థ. మా డొమైన్ anthrophic.in. వినియోగదారుల్లో మాకు ఇప్పటికే ‘అంత్రోపిక్’గా మంచి గుర్తింపు ఉంది” అని తెలిపారు. అమెరికన్ సంస్థ అదే తరహా డొమైన్ ఉపయోగించడం వల్ల తమ వ్యాపారానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంకా తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘క్విక్‌ట్యూన్స్’ అనే పరిష్కారం డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ వల్ల జరిగే మరణాలను తగ్గించే లక్ష్యంతో రూపొందించామని తెలిపారు. ఈ ఆవిష్కరణకు కర్ణాటక ప్రభుత్వ నుంచి నగదు పురస్కారం కూడా లభించిందని పేర్కొన్నారు. విద్య, కనెక్టివిటీ, భద్రత రంగాల్లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని భారత సంస్థ వెల్లడించింది.
ఫిర్యాదులో మరో ముఖ్య అంశంగా, భారత సంస్థ 2017 నుంచే “అంత్రోపిక్” పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, అమెరికన్ సంస్థ మాత్రం 2021లో స్థాపించబడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రేడ్‌మార్క్ హక్కులు తమవేనని భారత సంస్థ వాదిస్తోంది.
ఈ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో అమెరికన్ సంస్థ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల బెంగళూరు లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ దేశవ్యాప్తంగా పలు భాగస్వామ్యాలను ప్రకటించింది. ఆసియా ఖండంలో టోక్యో తర్వాత బెంగళూరే తమ రెండో కార్యాలయమని సంస్థ తెలిపింది.
అక్టోబర్ 2025లో ప్రకటించిన విస్తరణ ప్రణాళికల అనంతరం భారత్‌లో తమ రన్‌రేట్ ఆదాయం రెండింతలు పెరిగిందని అమెరికన్ సంస్థ వెల్లడించింది. ఈ కేసు భవిష్యత్తులో బ్రాండ్ హక్కులపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
- RajyaSabhaElections: తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్
- Nithya Menen: నటి నిత్యా మీనన్ కొత్త అడుగు.

