Kurnool: ఒక్క సారిగా పేలిన 400 మొబైల్ ఫోన్లు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనను కలిగించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. (Kurnool) ప్రారంభంలో ఇది సాధారణ ప్రమాదమని భావించిన అధికారులకు, ఫోరెన్సిక్‌ నివేదికలు వచ్చాక కొత్త కోణం బయటపడింది.

Image

ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా పరిశీలించి చేసిన నివేదిక ప్రకారం, బస్సు లగేజీ క్యాబిన్‌లో ఉన్న వందల సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు ఒక్కసారిగా పేలడం వల్లే ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిందని తేలింది. బస్సులో 400కు పైగా కొత్త మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ బాక్స్‌లు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఫోన్ల లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీలు అధిక వేడి తట్టుకోలేక ఒకేసారి పేలిపోయినట్టు తేలింది.

ప్రమాదానికి దారితీసిన ఘటనల పరంపర కూడా ఫోరెన్సిక్‌ అధికారులు వివరించారు. ట్రావెల్స్‌ బస్సు రహదారిపై వెళ్తుండగా ఒక బైక్‌ ను ఢీకొట్టింది. ఢీకొన్న సమయంలో బైక్‌ ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడటంతో, పెట్రోల్‌ బస్సు కింద చిందింది. అదే సమయంలో బైక్‌ బస్సు కింద ఇరుక్కుపోయి, బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై పెట్రోల్‌ చెలరేగి మంటలు ప్రారంభమయ్యాయి.

మొదట మంటలు బస్సు కింది భాగంలోని లగేజీ క్యాబిన్‌ వైపుకు వ్యాపించాయి. అందులోనే 400 మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉండటంతో, వేడి పెరిగి ఒక్కసారిగా ఫోన్ల బ్యాటరీలు పేలిపోయాయి. ఒక్క క్షణంలోనే శబ్దాలు, పేలుళ్లు జరిగి, భారీ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి.

లగేజీ క్యాబిన్‌ పైభాగంలో ఉన్న సీట్లు, బెర్త్‌లలో కూర్చున్న ప్రయాణికులకు ఆ మంటల వేడి తట్టుకోలేకపోయారు. పొగతో, మంటలతో క్షణాల్లోనే బస్సు మొత్తం దహనమైంది. ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే, కొందరు ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నించినా, కుడివైపున ఉన్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారు చిక్కుకుపోయారు.

డ్రైవర్‌ మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే బస్సును రహదారి పక్కన నిలిపి, తన సీటు పక్కన ఉన్న కిటికీ ద్వారం ద్వారా బయటకు దిగి, వెనుక వైపునకు వెళ్లి ఆ ప్రాంతం నుండి పారిపోయినట్టు చెబుతున్నారు.

ఫోరెన్సిక్‌ టీమ్స్‌ చెబుతున్న ప్రకారం, ఈ ప్రమాదం కేవలం ఢీకొట్టడం వల్లే కాదు, లగేజీ క్యాబిన్‌లో సరైన రక్షణ చర్యలు లేకుండా మొబైల్‌ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తరలించడం వల్ల తీవ్రత పెరిగిందని తేలింది.

అధికారులు ఇప్పుడు బస్సు ట్రావెల్స్‌ యజమానిపై, మరియు ప్రమాదానికి బాధ్యులపై కేసులు నమోదు చేశారు. అంతేకాక, ఎలక్ట్రానిక్‌ వస్తువులను పెద్ద మొత్తంలో సరైన భద్రతా చర్యలు లేకుండా ప్రజా రవాణా వాహనాల్లో తరలించకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాద స్థలంలో ఇప్పటికీ మంటల వాసన, కాలిపోయిన వస్తువుల దృశ్యాలు ప్రజల గుండెల్లో భయాన్ని నింపుతున్నాయి.

Also read: