దేశీయ బులియన్ మార్కెట్‌లో (SilverPrice) వెండి ధరలు ఊహించని స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర రూ.24 వేల వరకు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఒక్కరోజులోనే రూ.12 వేల పెరుగుదల నమోదవడం వెండి రేస్ ఎంత వేగంగా సాగుతోందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో (SilverPrice) వెండి ధర రూ.3,30,000కు చేరింది. ఈ వేగం ఇలాగే కొనసాగితే త్వరలోనే కిలో వెండి ధర రూ.3.50 లక్షల మార్క్‌ను తాకే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
వెండి ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ భారీగా పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆభరణాలకే పరిమితమైన వెండి వినియోగం ఇప్పుడు ఆధునిక సాంకేతిక రంగాలకు విస్తరించింది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి కీలక పాత్ర ఉండటంతో రిన్యూవబుల్ ఎనర్జీ రంగం నుంచి భారీ డిమాండ్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెరగడంతో వెండి వినియోగం మరింత పెరిగింది.
అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ వెండికి విస్తృత వినియోగం ఉంది. బ్యాటరీలు, సర్క్యూట్లు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాల్లో వెండి అవసరం తప్పనిసరి అవుతోంది. 5జీ టెక్నాలజీ విస్తరణతో టెలికాం రంగం నుంచి కూడా వెండికి డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, చిప్స్, ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో వెండి కీలక ముడి పదార్థంగా మారింది.
ఇవన్నీ కలిసి వెండి ధరలను ఆకాశానికెత్తుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరల పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్ మారకం విలువలు, జియోపాలిటికల్ అనిశ్చితులు కూడా వెండి ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయని నిపుణుల అభిప్రాయం.
వెండితో పాటు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. త్వరలోనే 10 గ్రాముల ధర రూ.1,50,000 మార్క్‌ను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.950 పెరిగి రూ.1,35,000కు చేరింది.
మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ ఊపందుకుంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనుగోళ్లు పెరగడం ధరలపై మరింత ఒత్తిడి తెస్తోంది. రాబోయే రోజుల్లో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ధరలు మరింత ఎగబాకవచ్చని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
పెట్టుబడిదారుల దృష్టి కూడా ఇప్పుడు వెండిపై పడుతోంది. బంగారంతో పోలిస్తే వెండిలో ఇంకా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి వెండిని మరోసారి హాట్ కమోడిటీగా మార్చేశాయి.
Also read:

