రాష్ట్రవ్యాప్తంగా (MunicipalElections) మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, ఆ తరువాత అధికారికంగా (MunicipalElections) నామినేషన్ ప్రక్రియకు తెరపడింది. ఈ ఎన్నికల్లో ఈసారి కొత్త రాజకీయ సమీకరణలు కనిపించడంతో మున్సిపల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఈసారి తొలిసారిగా మూడు కొత్త పార్టీలు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడం గమనార్హం. మాజీ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుపై తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన తెలంగాణ జాగృతి మున్సిపల్ ఎన్నికల ద్వారా తన ఉనికిని బలపరచుకునే ప్రయత్నం చేస్తోంది.
అదే విధంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో విస్తరణ లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తీన్మార్ మల్లన్న నాయకత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పలు కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పోటీలో నిలిచింది. ఈ పరిణామాలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇవే కాకుండా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దించాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,582 వార్డు స్థానాలకు, అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 414 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి.
రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఉపసంహరణల అనంతరం గుర్తుల కేటాయింపు జరుగనుంది.
గుర్తుల కేటాయింపు పూర్తైన వెంటనే అధికారిక ప్రచారానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రచారానికి కేవలం ఆరు రోజుల మాత్రమే గడువు ఉండటంతో పలువురు అభ్యర్థులు ఇప్పటికే అనధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియా, డోర్ టు డోర్ ప్రచారం, స్థానిక సమావేశాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎన్ని వార్డు, డివిజన్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయన్న అంశంపై ఈ రాత్రికి స్పష్టత రానుంది. సింగిల్ నామినేషన్లు ఎక్కువగా ఉంటే కొన్ని స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసే అవకాశముంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read:

