Sachin Tendulkar : నిన్ను ఎంతో మిస్ అవుతున్నా..

Sachin Tendulkar

 

Sachin Tendulkar : భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్కర్ త‌న చిర‌కాల ప్రత్యర్ధిని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దివంగ‌త లెజెండ‌రీ స్పిన్నర్షేన్ వార్న్ ప్రథ‌మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా అత‌నితో దిగిన ఒక‌ప్పటి ఫొటోను స‌చిన్ (Sachin Tendulkar) ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. అత‌నితో త‌న‌కున్న అనుబంధం గురించి వివ‌రించాడు. ‘మేము మైదానంలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం.

ఇద్దరంం ఎన్నో అపురూప‌మైన జ్ఞాప‌కాలు వెన‌కేసుకున్నాం. ఒక గొప్ప క్రికెట‌ర్‌గానే కాదు ఒక గొప్ప స్నేహితుడిగా నిన్న ఎంతో మిస్ అవుతున్నా. అయితే.. నీ హాస్య చ‌తుర‌త‌, వాక్చాతుర్యంతో స్వర్గాన్ని మరింత ఆహ్లాద‌ర‌క‌ర‌మైన ప్రాంతంగా మార్చావ‌ని అనుకుంటున్నా’ అని ఆ ఫొటోల‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్లు ఎప్పుడు త‌ల‌ప‌డినా కూడా షేన్ వార్న్, స‌చిన్ మ‌ధ్య పోరాటం ఆస‌క్తిక‌రంగా ఉండేది. అయితే.. మైదానంలో ప్రత్యర్థులైన వీళ్లు బ‌య‌ట మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. అంతు చిక్క‌ని బౌలింగ్‌తో బ్యాట‌ర్ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టే వార్న్‌ను మాస్టర్ బ్లాస్టర్‌ స‌చిన్‌ ధాటిగా ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌లో ఈ లెగ్ స్పిన్నర్‌ను ఒక‌ ఆటాడుకున్నాడు.

దాంతో, స‌చిన్ త‌న‌కు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడ‌ని గ‌తంలో షేన్ వార్న్ వెల్లడించిన విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన వార్న్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లోనూ ఆడాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌గా ఆ జ‌ట్టు తొలి సీజ‌న్‌లోనే ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత కామెంటేట‌ర్‌గా కొన‌సాగాడు.

ఆట‌తో ఆకాశ‌మంత ఎత్తు ఎదిగిన వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్‌లో చెర‌గ‌ని ముద్ర వేశాడు. మైదానంలో స‌క్సెస్ అయిన అత‌ని జీవితంలో చీకటి రోజులు కూడా ఉన్నాయి. అమ్మాయిలతో వ్య‌వ‌హారం న‌డ‌ప‌డం, డ్ర‌గ్స్ తీసుకోవ‌డం వంటివి అత‌నికి చెడ్డ పేరు తెచ్చాయి. గ‌త ఏడాది థాయ్‌లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ మార్చి 4న అనుకోకుండా గుండెపోటుతో మ‌ర‌ణించాడు.

అత‌ను త‌న గ‌దిలో ప‌డిపోవ‌డం గ‌మ‌నించిన సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే వార్న్ క‌న్నుమూశాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు (708) తీసిన రెండో బౌల‌ర్‌గా గుర్తింపు సాధించాడు. శ్రీ‌లంక దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్లతో మొద‌టి స్థానంలో ఉన్నాడు.

Also Read :