IITAMoinabad: విధుల్లోకి 75 జాగిలాలు

IITAMoinabad

ఐఐటీఏ మొయినాబాద్‌లో (IITAMoinabad) 25వ బ్యాచ్ పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. నేర పరిశోధనను మరింత పటిష్ఠం చేయడం, శాంతిభద్రతల పరిరక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా శిక్షణ పొందిన మొత్తం 76 జాగిలాలు ఇక నుంచి విధుల్లోకి చేరనున్నాయి. (IITAMoinabad) ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో కఠినమైన శిక్షణ పూర్తి చేసిన ఈ జాగిలాలు పరేడ్ సందర్భంగా తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించి అధికారుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రత్యేకంగా పేలుడు పదార్థాల గుర్తింపు, మాదకద్రవ్యాల అన్వేషణ, నిందితుల అడుగుజాడల ట్రాకింగ్ వంటి కీలక రంగాల్లో ఈ జాగిలాలు సేవలందించనున్నాయి.

Image

ఈ బ్యాచ్‌లో తెలంగాణకు చెందిన 42 జాగిలాలు ఉండగా, బీహార్ సీఐడీ నుంచి 30, హైదరాబాద్ విమానాశ్రయ భద్రత కోసం సీఐఎస్‌ఎఫ్ నుంచి 4 జాగిలాలు శిక్షణ పొందాయి. వీటితో పాటు 76 ప్రధాన హ్యాండ్లర్లు, 29 స్పేర్ హ్యాండ్లర్లు కలిపి మొత్తం 105 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. జాగిలాలు మరియు హ్యాండ్లర్ల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు.

Image

శిక్షణ పొందిన 76 జాగిలాల్లో 28 లాబ్రడార్‌లు, 27 జర్మన్ షెపర్డ్‌లు, 15 బెల్జియన్ మెలినోయిస్‌లు, 2 కోకర్ స్పానియల్‌లు ఉన్నాయి. వీటిని ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా విభజించారు. పేలుడు పదార్థాల గుర్తింపుకు 45 జాగిలాలు సిద్ధంగా ఉండగా, మాదకద్రవ్యాల గుర్తింపుకు 22, నిందితుల అడుగుజాడలను అనుసరించడానికి 9 జాగిలాలను ప్రత్యేకంగా తయారు చేశారు. ముఖ్యంగా బీహార్ సీఐడీ నుంచి వచ్చిన వాటిలో 20 జాగిలాలను మాదకద్రవ్యాల గుర్తింపుకే కేటాయించడం గమనార్హం.

Image

ఈ జాగిలాల చేరికతో రాష్ట్ర భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. వరంగల్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు రాచకొండ కమిషనరేట్, గ్రేహౌండ్స్ విభాగాలకు వీటిని కేటాయించనున్నారు. నేర నియంత్రణలో, పేలుడు పదార్థాల నివారణలో, డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో సాంకేతికతతో పాటు శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు కూడా అంతే కీలకమని నిపుణులు చెబుతున్నారు.

Also read: