జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ(BJP) తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. పార్టీకి గట్టి బలం చేకూరేలా అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి రాజీపడరాదన్న ధోరణిలో ఉన్న బీజేపీ, సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. (BJP) ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత మరియు అడ్వకేట్ కోమల ఆంజనేయులు లతో కూడిన మూడు మంది కమిటీని రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలోని స్థానిక నేతలు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీలతో చర్చలు జరిపింది.
బర్కత్‌పురాలోని బీజేపీ సిటీ కార్యాలయంలో నిన్న కమిటీ సమావేశమైంది. ఇందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిగా ఎవరు బలంగా నిలుస్తారనే అంశంపై వారి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక బలాబలాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం ఐదుగురు నాయకుల పేర్లను సూచిస్తూ నివేదికను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గడ్డం రాంచందర్ రావుకు అందజేసింది.
కమిటీ సూచించిన పేర్లలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుష నాయకులు ఉన్నారు. ఈ జాబితాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి పేరు కూడా ఉండగా, కొత్తగా జూటూరి కీర్తి రెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, ఆకుల విజయ పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఐదుగురిలో ఎవరు తుది అభ్యర్థిగా నిలుస్తారనే ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ నివేదికను పరిశీలించి, కీలక నాయకులతో చర్చలు జరపనున్నారు. అనంతరం ఈ ఐదుగురు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపిస్తారు. కేంద్ర నాయకత్వం అభ్యర్థిని తుది దశలో ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎప్పటి నుంచీ పట్టణ బీజేపీకి ప్రాధాన్యత కలిగిన సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి ఉప ఎన్నికలతో బీజేపీకి నగరంలో తమ బలం నిరూపించుకునే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బలమైన మధ్యతరగతి ఓటర్లతో పాటు విద్యావంతుల ఓటు బ్యాంకు ఉండటంతో అభ్యర్థి ఎంపికలో పార్టీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి బీజేపీ మహిళ అభ్యర్థిని రేసులో నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహం రూపొందిస్తోంది. పార్టీ తుది అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనుంది.
Also read: