CM: బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ అవయవదానం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది బూడిదేనని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 సెగ్మెంట్లలో ఏడు చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఇవాళ సీఎం(CM) మీడియాతో మాట్లాడారు. ఒక్క మెదక్ లో మాత్రమే డిపాజిట్ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సిద్దిపేటలో ఆ పార్టీ గెలుస్తూ వచ్చిందని ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 63 వేల ఓట్లు వచ్చాయని, బీఆర్ఎస్ కు 65 వేల ఓట్లు పోలయ్యాయని చెప్పారు. బీజేపీ కోసం వెంకట్రామిరెడ్డిని బలిపశువును చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయ్యాయని చెప్పారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కలను పరిశీలిస్తే కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో మాత్రమే బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చిందని చెప్పారు. మొత్తంగా ఓట్ల శాతం కూడా 16.5 కు పడిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ సహకారంతో
26 శాతం ఉన్న బీజేపీ ఓట్ల శాతం కాస్తా 35%కు పెరిగిందని చెప్పారు. (CM)

మోదీ తప్పుకోవాలి
దేశ వ్యాప్తంగా బీజేపీని ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2019లో బీజేపీకి సొంతంగా 303 ఎంపీలు ఉంటే ఇప్పుడు 240కి పడిపోయిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ పక్షాలు మోదీ గ్యారెంటీ పేరుతో ప్రచారం చేశాయని అన్నారు. దానిని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి హుందాగా తప్పుకోవాలని సూచించారు. ఇతరులెవరికైనా అవకాశం కల్పించాలని అన్నారు.

మా పాలనకు రెఫరెండమే
ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు 39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు 41శాతానికి పెరిగాయని చెప్పారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీ సీట్లు గెలిచామని, అవి ఇప్పుడు 8 అయ్యాయని అన్నారు. ఐదు సీట్లు పెరిగాయని, ప్రజలు ఆశీర్వదించారనేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు. బోనస్ గా బీఆర్ఎస్ చేతిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం కూడా గెలుచుకున్నామని చెప్పారు. దీంతో అసెంబ్లీలో తమ బలం పెరిగిందని అన్నారు. కార్యకర్తలు, నాయకుల కృషితోనే తాము విజయం సాధించామని, కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకూ కృతజ్ఞతలు చెబుతున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ రాజకీయ జూదగాడు
కేసీఆర్ పెద్ద రాజకీయ జూదగాడు అని, ఆయన బతికున్నంత కాలం కుట్రలు కుతంత్రాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతూనే ఉంటాయని ఆరోపించారు. మహారాష్ట్రలో కుట్రల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని అన్నారు. ఫీనిక్స్ పక్షిలా ఎగురుతామని కేటీఆర్ అంటున్నారని, బీఆర్ఎస్ బూడిదైందని అది ఎప్పటికీ లేవదని అన్నారు.

Also read: