డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని (CM) సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ డీలిమిటేషన్ వాయిదా వేయాలని కోరుతూ ఆయన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 42 లోక్ సభ, 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో 225, తెలంగాణలో 153 సెగ్మెంట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పెట్టారని అన్నారు. కొత్త నియోజకవర్గాలపై తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నకు 2025 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. అయితే తర్వాత జమ్మ కాశ్మీర్, సిక్కంలో కొత్త నియోజకవర్గాలను కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఏర్పాటు చేశారని తెలపారు. కాశ్మీర్ లో 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేశారని చెప్పారు. పునర్విభజన చట్టంలో ఉన్న ఏపీ, తెలంగాణ అంశాన్ని విస్మరించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాల నుంచి 130 మంది ఎంపీలున్నారని, ఇది పార్లమెంటులో 24% అని చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం పునర్వభజన చేస్తే లోక్ సభ సీట్లు పెరిగినట్టే కనిపించినా.. మన ప్రాతినిధ్య శాతం 19%కు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనం రాజకీయ ప్రాతినిధ్యం వదులుకునేందుకు సిద్ధంగా లేమని, ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి ఐక్యతను చాటాలని అన్నారు. ఇందుకోసం పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని (CM) సీఎం కోరారు. రాష్ట్రాలను సంప్రదించకుండా డీలిమిటేషన్ చేయొద్దని కోరుదామని, ప్రభుత్వం దిగిరాని పక్షంలో పోరాటం నిర్మిద్దామని సీఎం పిలుపునిచ్చారు..
కేంద్రం ద్వంద్వ వైఖరి
కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై వివక్షను చాటుతూ ఉందని సీఎం అన్నారు. గతంలో ప్రధాన మంత్రులుగా వ్యవహరించిన దివంగత ఇందిరాగాంధీ, వాజ్ పేయి రాజ్యాంగ సవరణల ద్వారా డీలిమిటేషన్ ను వాయిదా వేశారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ చేసేందుకు రెడీ అవుతోందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఒక్క రూపాయి పన్నుగా కేంద్రానికి చెల్లిస్తే తిరిగి వస్తున్నది కేవలం 42 పైసలని అన్నారు. బీహార్ రూపాయి కడితే ఆరు రూపాయల ఆరు పైసలు ఇస్తోందని, అదే విధంగా యూపీకి రూ. 2.73పైసలు ఇస్తోందని, మధ్యప్రదేశ్ కు రూ. 1.73పైసలు ఇస్తోందని అన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన పాపానికి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అందరం కలిసి కేంద్రంతో మాట్లాడుదామని సీఎం అన్నారు. డీలిమిటేషన్ వాయిదా వేయాలని కోరుదామని, కలిసి రాకుంటే పోరాటం నిర్మించుకుందామని అన్నారు. దీనిపై హైదరాబాద్ లో అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుందామని సీఎం చెప్పారు.
Also read:

