Drugs: ఆబ్కారీ అధికారులకు ఆయుధాలు

Drugs

ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమని, మత్తు పదార్థాలపై (Drugs) రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, గంజాయి, డ్రగ్స్ (Drugs), నాటుసారా, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మత్తు పదార్థాల నియంత్రణ కోసం పనిచేసే అధికారులకు ఆయుధాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. క్రమశిక్షణతో పనిచేసే అధికారులను గుర్తించి ఆయుధాలపై ప్రత్యేక శిక్షణ (వెపన్ ట్రైనింగ్) అందించాలని ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకం, వినియోగంపై సమగ్ర అధ్యయనం జరిపి, పట్టుబడిన నల్లబెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీలో ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నప్పుడు బాటిళ్లను పగలగొట్టకుండా వినియోగించే మార్గాలపై పరిశోధన చేయాలని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా, గంజాయి మాత్రమే కాకుండా సింథటిక్ డ్రగ్స్ తయారీ, రవాణా, అమ్మకాలపై పూర్తి స్థాయి దృష్టి సారించాలని సూచించారు.

నాచారం, చర్లపల్లి తదితర పరిశ్రమల ప్రాంతాల్లో ఆబ్కారీ శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ఒకే లైసెన్స్‌పై అనధికారికంగా అనేక బార్లు నడుపుతున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, ఫార్మ్ హౌస్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి, ఖాళీగా ఉన్న రైస్ మిల్లులు వంటి ప్రదేశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని, ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా Enforcement Director షాన్‌వాజ్ ఖాసీం మాట్లాడుతూ – గంజాయి, డ్రగ్స్, ఎన్‌డీపీఎల్, నాటుసారా తయారీ మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపడానికి అవసరమైన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశామని వెల్లడించారు.

సమావేశంలో అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యానికి వ్యతిరేకంగా మరింత దూకుడుగా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది.

Also read: