తెలంగాణ రాజకీయాల్లో వేడిగా కొనసాగుతున్న విమర్శల యుద్ధంలో భాగంగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు (HarishRao) మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 శాతం కమిషన్ల పాలన నడుస్తోందని, ఏ ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాలన్నా భారీ కమిషన్ తప్పనిసరి అయిందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ (HarishRao) హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాదిరిగా ప్రభుత్వం నడుస్తోందని వ్యాఖ్యానించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ ప్రజాభవన్‌ను ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలకు కాకుండా విందులు, ప్రైవేట్ మీట్లు, పెళ్లిళ్లు, సీఎల్పీ సమావేశాల కోసం ఉపయోగించడం రేవంత్ రెడ్డి బిల్డప్ రాజకీయానికి నిదర్శనం అని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రతిరోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ఇచ్చిన హామీ ఇప్పుడు కనిపించడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు వేదన, రోదన, నిరాశ మాత్రమే మిగిలిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, రాష్ట్ర అభివృద్ధికి మునుపటి వేగం కనిపించడం లేదని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే ఆదాయం తగ్గిపోయిన విషయం గురించి ప్రభుత్వం సమీక్ష చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, వారి అనుచరుల వరకు వ్యవస్థీకృత అవినీతితో వ్యవహరిస్తున్నారని, ఇది ఆర్గనైజ్డ్ కరప్షన్‌కు స్పష్టమైన ఉదాహరణ అని హరీశ్ విమర్శించారు.
హరీశ్ రావు తదుపరి మాట్లాడుతూ, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్.ఆర్. రెడ్డి ద్వారా రాష్ట్రంలో అవినీతి పన్ను విధించబడిందని ఆరోపించారు. ఫైనాన్స్ శాఖ నుండి బిల్లు తీసుకోవాలంటే 30 శాతం కమిషన్ తప్పనిసరి అన్న విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఘాటుగా విమర్శించారు. ఈ మొత్తంగా రాష్ట్రంలో ఏర్పడుతున్న అవినీతి వాతావరణానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడం, అభివృద్ధి పనుల్లో స్పష్టత లేకపోవడం, సంక్షేమ కార్యక్రమాలు మందగించడం ప్రజల్లో ఆందోళనలు పెంచాయని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఇప్పటికి ఎవరికి అర్థం కాలేదని, రెండు సంవత్సరాల్లోనూ స్పష్టమైన పాలన కనిపించకపోవడం కాంగ్రెస్ వైఫల్యాన్ని సూచిస్తుందని అన్నారు.
హరీశ్ రావు ఈ వ్యాఖ్యలతో మరోసారి బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరం పదును ఎక్కింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read:
