సెప్టెంబర్ 30వ తేదీలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు (Highcourt) తీర్పు వెలువరించింది. ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి జస్టిస్ మాధవి బెంచ్ విచారణ జరిపింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టి ఇవాళ వెల్లడించింది. ప్రభుత్వ అభ్యర్థనను సైతం పరిగణలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు (Highcourt) వాదనలు వినిపించారు. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని, ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని తెలిపారు.
ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారని ధర్మాసనానికి విన్నవించారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేదా పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు వార్డుల విభజనకు నెల రోజుల టైం పడుతుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ బెంచ్ ని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించగా కులగణన కోసం జాప్యం జరిగిందని వివరించారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం నెల రోజులు, ఈసీ రెండు నెలల గడువు కోరింది. ఇటు ప్రభుత్వం, అటు ఈసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పును వెలువరించింది.
Also read:
- Trump: ట్రంప్ కు నోబెల్ ఇవ్వండి
- PAK: న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేస్తున్న పాకిస్తాన్

