Kishan Reddy : సీఎం కేసీఆర్కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని, వారి చెర నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సనత్నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని సెజ్కాలనీ, వెంగళ్ రావు నగర్డివిజన్లో నిర్వహించిన ‘‘ప్రజాగోస– బీజేపీ భరోసా” స్ట్రీట్కార్నర్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని వనరులను బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్అక్రమంగా సంపాదించిన సొమ్ముతో విమానాలు కొంటున్నారన్నారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అంతా దోచుకుంటారన్నారు. బీఆర్ఎస్ పేరుతో పలు రాష్ట్రాల నాయకులకు మన డబ్బులిస్తున్నారని విమర్శించారు.
దోపిడీ సొమ్ముతో కొడుకు, బిడ్డ, అల్లుడు, మనవడికి ఒక్కో ఫాం హౌస్ఇచ్చారని, రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్లాంటి పథకాలను నిర్వీర్యం చేశారన్నారు.

